తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhuvanagiri Hospital: భువనగిరి ప్రభుత్వాస్పత్రిలో శవాన్ని కొరుక్కుతిన్న ఎలుకలు

Bhuvanagiri Hospital: భువనగిరి ప్రభుత్వాస్పత్రిలో శవాన్ని కొరుక్కుతిన్న ఎలుకలు

HT Telugu Desk HT Telugu

01 August 2023, 9:04 IST

google News
    • Bhuvanagiri Hospital: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతినడంతో బంధువులు ఆందోళనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి  మార్చురీలో భద్రపరిచిన మృతదేహాన్ని ఎలుకలు, పందికొక్కులు కొరికేశాయని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు.
మార్చురీలో శవాన్ని కొరుక్కు తిన్న ఎలుకలు
మార్చురీలో శవాన్ని కొరుక్కు తిన్న ఎలుకలు

మార్చురీలో శవాన్ని కొరుక్కు తిన్న ఎలుకలు

Bhuvanagiri Hospital: ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కు తిన్న ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనపై మృతుని బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బామపాలెం గ్రామానికి చెందిన పెరికెల రవి కుమార్(35) భువనగిరి పట్టణంలో నివసిస్తున్నాడు. భువనగిరి ప్రగతినగర్‌లో తన పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు.

మద్యానికి బానిసైన రవి కుమార్ ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించారు. సోమవారం శవపరీక్షకు సిద్ధం చేస్తున్న సమయంలో ముఖంపై చర్మం అక్కడక్కడా కొరికినట్లు లోతైన గుంతలు పడి ఉండటాన్ని కుటుంబసభ్యులు గమనించారు.

మృతదేహాన్ని ఫ్రీజర్‌లో భద్రపర్చాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా గదిలోనే ఉంచారని వారు ఆరోపించారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చిన్ననాయక్‌ను వివరణ కోరగా.. మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలోనే ముఖంపై గాట్లున్నాయని, ఫ్రీజర్‌లోనే సిబ్బంది భద్రపరిచారని తెలిపారు. భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌కృష్ణ.. రవిశంకర్‌ మృతదేహాన్ని మార్చురీకి తరలించిన సమయంలో ఎలాంటి గాయాలు, గాట్లు లేవని చెప్పారు.

గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవి కుమార్ కుటుంబం ఉపాధి కోసం 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్‌కు వివాహం జరగా, ఒక కుమార్తె జన్మించింది. కొంతకాలానికి భార్య చనిపోవడంతో, రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు.

ఏడాది క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో రెండో భార్య రవికుమార్‌ను వదిలి వెళ్లింది. దీంతో తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి పట్టణంలోని ప్రగతినగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. డ్రైవర్‌గా పని చేస్తున్న రవికుమార్‌ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు.

మద్యం మత్తులో గొడవ చేస్తుండటంతో తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. తిరిగి రాత్రి 11:30 నిమిషాలకు ఇంటికి వచ్చేసరికి రవికుమార్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో కాకుండా బయట నేలపై భద్రపరిచారు.

రవికుమార్‌ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. అప్పటికే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. మార్చురీలో ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చిన్నానాయక్‌ చెప్పారు.

తదుపరి వ్యాసం