Thane hospital : 24 గంటల్లో 18 మంది రోగులు మృతి.. ఆ ఆసుపత్రిలో ఏం జరిగింది!
14 August 2023, 10:12 IST
Thane hospital : మహారాష్ట్ర థానేలోని ఓ ఆసుపత్రిలో 24 గంటల్లో 18మంది రోగులు మరణించారు. ఈ వార్త స్థానికంగా సంచలనంగా మారింది.
24 గంటల్లో 18 మంది రోగులు మృతి.. ఆ ఆసుపత్రిలో ఏం జరిగింది!
Thane hospital deaths : మహారాష్ట్ర థానేలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆసుపత్రిలో.. 24 గంటల వ్యవధిలో ఏకంగా 18మంది మరణించారు! దీని వెనుకు కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఆ 24 గంటల్లో.. అసలేం జరిగింది?
థానేలోని ఛత్రపతి శివాజి మహరాజ్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 18మంది మృతుల్లో 10మంది మహిళలు, 8మంది పురుషులు ఉన్నారని అధికారులు చెప్పారు. వీరిలో ఆరుగురు థానేవాసులు కాగా నలుగురు కల్యాణ్, ముగ్గురు సహపూర్, ఒకరు భివండి, మరో ఇద్దరు ఉల్హస్నగర్- గోవిండి వచ్చారని తెలిపారు. మరణించిన వారిలో ఇద్దరి వివరాలపై క్లారిటీ లేదని వెల్లడించించారు.
24 గంటల వ్యవధిలో మరణించిన వారిలో 12 మంది వయస్సు 50ఎళ్ల కన్నా ఎక్కువగా ఉంది. వీరందరు కిడ్నీలో రాళ్లు, పక్షవాతం, అల్సర్స్, నిమోనియా, సెప్టిసేమియా వంటి రోగాలతో బాధపడుతున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే.. మరణాల వెనుక ఉన్న కారణాలను కనుగొనేందుకు స్వతంత్ర దర్యాప్తు కమిటీని నియమించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
"హెల్త్ సర్వీస్ కమిషనర్.. ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. మరణాల ఎందుకు జరిగాయి? అన్నది దర్యాప్తు చేస్తారు. చికిత్సలో ఏమైనా లోపం జరిగిందా? అని పరిశీలిస్తారు. మరణించిన వారి బంధువుల స్టేట్మెంట్స్ తీసుకుంటారు. చాలా లోపాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తాము. కమిటీ దర్యాప్తు చేస్తుంది," అని సివిక్ కమిషనర్ అభిజిత్ బంగర్ మీడియాకు తెలిపారు.
Thane hospital news : "మరణించిన వారిలో కొందరి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న సమయంలో ఆసుపత్రిలో చేరారని సిబ్బంది చెబుతున్నారు. చికిత్స చేస్తుండగా వారు మరణించారని వివరించారు. మృతుల్లో కొందరు వృద్ధులు ఉన్నారు. ఆసుపత్రిలో పోలీసుల గస్తీని పెంచాము. మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఏదైనా జరగొచ్చు అని ఈ నిర్ణయం తీసుకున్నాము," అని డీసీపీ గణేశ్ గావ్డే తెలిపారు.
థానే ఆసుపత్రిలో అనుమానాస్పద మరణాలపై వార్త అందుకున్న అనంతరం.. అక్కడికి వెళ్లారు ఆ రాష్ట్ర మంత్రి అదితి తత్కరే. ప్రభుత్వం తరఫు నుంచి పరిహారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని వెల్లడించారు.
అయితే.. ఆసుపత్రిపై వర్క్ లోడ్ ఎక్కువగా ఉండటాన్ని ప్రస్తావించారు థానే మాజీ మేయర్ నరేశ్ మస్కే.
Maharashtra latest news : "ఆసుపత్రిపై వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. రోజుకు 650 మంది రోగులకు ఇక్కడ చికిత్స జరుగుతుంది. కానీ ఆసుపత్రి కెపాసిటీ 500 మాత్రమే," అని నరేశ్ తెలిపారు.
మరోవైపు ఆసుపత్రిలోని వైద్యుల్లో కొందరికి డెంగ్యూ సోకిందని, ఫలితంగా కార్యకలాపాలు నెమ్మదించాయని తెలుస్తోంది.