Scheme for minor rape victims : అత్యాచార బాధితులకు ఆర్థిక సాయం.. కేంద్రం కీలక నిర్ణయం!
04 July 2023, 7:32 IST
Scheme for minor rape victims : అత్యాచారంతో అవాంఛిత గర్భం దాల్చి, కుటుంబసభ్యులు వదిలేసిన మైనర్లకు ఆర్థిక, వైద్య సాయం అందించాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడదుల చేసింది.
అత్యాచార బాధితులకు ఆర్థిక సాయం.. కేంద్రం కీలక నిర్ణయం!
Scheme for minor rape victims : అత్యాచార ఘటనలతో గర్భం దాల్చిన మైనర్లకు అండగా నిలిచే విధంగా చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. రేప్‌నకు గురై, గర్భం దాల్చి, కుటుంబసభ్యులు వదిలేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆర్థిక, వైద్య సాయం అందించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ వెల్లడించింది.
"నిర్భయ నిధుల్లో నుంచి రూ. 74.10 కోట్లను మంజూరు చేస్తున్నాము. గర్భం దాల్చిన అత్యాచార/ సామూహిక అత్యాచార బాలికలకు న్యాయం, మద్దతు లభించేందుకు ఈ చర్యలు చేపట్టాము," అని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
రేప్/ గ్యాంగ్ రేప్ కారణంగా కుటుంబం వదిలేసిన బాలికలకు షెల్డర్, భోజనం, నిత్యావసరాలు, కోర్టుకు వెళ్లేందుకు రవాణా కోసం ఈ నిధులను ఉపయోగించనున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవల్ప్మెంట్ పేర్కొంది.
Financial assistance for minor rape victims : సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పథకం కింద బాధితులకు నెలకు రూ. 4వేలు అందుతాయి. అదే సమయంలో బిడ్డను ఉంచుకోవడం ఇష్టం లేని మైనర్‌కు, ఆ బిడ్డను దత్తనిచ్చేందుకు సాయం లభిస్తుంది. బాలిక కోరుకున్న విధంగా వైద్య సేవలు అందుతాయి. షెల్టర్ హోంలో ఇతర బాలికలతో కాకుండా.. రేప్ బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.
18ఏళ్ల కన్నా తక్కువ వయస్సు, అనాధ/ కుటుంబసభ్యులు విడిచిపెట్టిన వారు లేదా కుటుంబంతో కలిసి జీవించడం ఇష్టం లేని వారు, పోక్సో చట్టంలో సెక్షన్ 3, సెక్షన్ 5, సెక్షన్ 376, 376ఏ-ఈ కేసుల్లో బాధితులుగా ఉన్న మైనర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఎఫ్ఐఆర్ కాపీ లేకపోయినా ఈ స్కీమ్‌తో లబ్ధి పొందొచ్చు. అయితే ఈ పథకం ద్వారా బాలికకు సాయం చేయాలని బాధ్యత తీసుకున్న వారి దగ్గర మాత్రం సంబంధిత ఎఫ్ఐఆర్ కాపీ ఉండాలి.
Ministry of Women and Child development : "అత్యాచారానికి గురైన మైనర్ల భౌతిక, మానసిక బాధ వర్ణనాతీతం. అందుకే రేప్ కారణంగా గర్భం దాల్చిన బాలికలకు సాయం చేయాలని మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సాయంతో పాటు వైద్య సేవలు కూడా అందించాలని నిర్ణయించాము. నిర్భయ పథకం కింద వీరికి ఇవి అందుతాయి," అని కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరాని తెలిపారు.
క్షేత్రస్థాయిలో మైనర్ బాధితులకు సాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, చిన్నారుల సంక్షేమ సంస్థలతో కలిసి పనిచేయనున్నట్టు, ఇందుకోసం మిషన్ వాత్సల్యను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు స్మృతి ఇరాని.
టాపిక్