Dhoni to Odisha Train Victims: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ధోనీ రూ.60 కోట్ల సాయం.. ఇందులో నిజమెంత?
Dhoni to Odisha Train Victims: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ధోనీ రూ.60 కోట్ల సాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో నిజమెంత? అతడు నిజంగానే ఈ భారీ సాయం చేస్తున్నాడా?
Dhoni to Odisha Train Victims: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం ఊహకందని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలుసు కదా. మూడు రైళ్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో 278 మంది మరణించారు. అయితే ఈ ప్రమాద బాధితులకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ.60 కోట్ల సాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రెండు రోజులుగా వాట్సాప్ లో ఈ న్యూస్ చెక్కర్లు కొడుతూనే ఉంది. అయితే ఈ వార్తలో నిజమెంత? నిజంగానే ధోనీ ఇంత భారీ మొత్తాన్ని సాయంగా ఇస్తున్నాడా అంటే దీనికి సమాధానం కాదు అనే చెప్పాలి. ఈ వార్తలో అసలు ఎలాంటి నిజం లేదని తేలింది. అంతకుముందు విరాట్ కోహ్లి కూడా ఈ ప్రమాద బాధితులకు ఎంతో కొంత సాయం చేస్తున్నాడన్న వార్త వచ్చినా.. అది కూడా నిజం కాదని తేలింది.
అయితే మరో టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చహల్ మాత్రం ఈ ప్రమాద బాధితులకు సాయం అందించడానికి ముందుకు వచ్చాడు. అతడు బాధిత కుటుంబాల కోసం తన వంతుగా రూ.లక్ష విరాళం అందించాడు. కోరమాండల్, హౌరా ఎక్స్‌ప్రెస్ లతోపాటు గూడ్సు రైలు ఢీకొనడంతో ఈ పెను విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ.. సోమవారం (జూన్ 5) నాటికి 278కి చేరింది. మరికొన్ని వందల మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పలువురు క్రికెటర్లతోపాటు ఇతర క్రీడాకారులు కూడా తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందన్న అనుమానంతో ఈ కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం