Virat Kohli on Australia: ఆ విజయం తర్వాత ఆస్ట్రేలియా మమ్మల్ని తేలిగ్గా తీసుకోవడం లేదు: విరాట్ కోహ్లి
Virat Kohli on Australia: ఆ విజయం తర్వాత ఆస్ట్రేలియా మమ్మల్ని తేలిగ్గా తీసుకోవడం లేదని అన్నాడు విరాట్ కోహ్లి. డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు స్టార్ స్పోర్ట్స్ తో అతడు మాట్లాడాడు.
Virat Kohli on Australia: ఒకప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ అంటే గర్వంతో విర్రవీగేవారు. ప్రత్యర్థిని చాలా తేలిగ్గా తీసుకునే వారు. ఫీల్డ్ లో అవతలి వాళ్లను మాటలతో, ఆటతో ముప్పుతిప్పలు పెట్టేవారు. కానీ ఆస్ట్రేలియాను వాళ్ల సొంతగడ్డపై ఓడించడం అసాధ్యమేమీ కాదని టీమిండియా నిరూపించింది. రెండుసార్లు వరుసగా కోహ్లి కెప్టెన్సీలోని టీమ్ ఆసీస్ గడ్డపై చారిత్రక విజయాలు సాధించింది.
ఆ విజయాల తర్వాత ఇండియన్ టీమ్ ను ఆస్ట్రేలియా తేలిగ్గా తీసుకోవడం లేదని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. 2018-19 టూర్ లో పూర్తిగా కోహ్లి కెప్టెన్సీలో, 2020-21లో తొలి టెస్టులో కోహ్లి, మిగతా మూడు టెస్టుల్లో రహానే కెప్టెన్సీలో టీమిండియా ఊహకందని విజయాలు సాధించింది. ఇప్పుడు బుధవారం (జూన్ 7) అదే ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇప్పుడు ఆస్ట్రేలియన్ల నుంచి తాము గౌరవం పొందుతున్నట్లు తెలిపాడు. "ఇండియా, ఆస్ట్రేలియా మధ్య గతంలో పోటీ చాలా తీవ్రంగా ఉండేది. చాలా ఘర్షణ వాతావరణం అనిపించేది. కానీ మేము ఆస్ట్రేలియాలో రెండు సిరీస్ లు గెలిచిన తర్వాత ఆ పోటీ కాస్తా గౌరవంగా మారింది.
ఓ టెస్టు టీమ్ గా మమ్మల్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. మాపై ప్రత్యర్థులకు ఉన్న గౌరవాన్ని చూశాం. వాళ్ల స్వదేశంలోనూ గట్టి పోటీ ఇస్తామని వాళ్లు భావిస్తున్నారు. మమ్మల్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. గతంలో రెండు జట్ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉండేది. ఇప్పుడలా లేదు. ప్రత్యర్థికి మన ఉనికి తెలిసింది" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ కోహ్లి అన్నాడు.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ ఓవల్లో జరుగుతుండటం కూడా కోహ్లి స్పందించాడు. అక్కడి కండిషన్స్ కు త్వరగా అలవాటు పడి అందుకు తగినట్లు ఆటతీరు మార్చుకుంటే గెలవచ్చని విరాట్ అన్నాడు. "ఓవల్లో బ్యాటింగ్ కు దిగినప్పుడు ఓ రకమైన కండిషన్స్ ను అంచనా వేయలేం.
త్వరగా వాటికి అలవాటు పడాల్సిన అవసరం ఉంది. రెండు జట్లకూ ఇది ఒక టెస్ట్ సిరీస్. అక్కడి కండిషన్స్ కు త్వరగా అలవాటు పడిన జట్టే గెలుస్తుంది. డబ్ల్యూటీసీలోని గొప్పతనం అదే. రెండు జట్లు ఓ తటస్థ వేదికపై ఆడటం. అక్కడి కండిషన్లకు ఎవరు అలవాటు పడతారో చూసే అవకాశం ఇప్పుడు ఉంటుంది" అని కోహ్లి అన్నాడు.
సంబంధిత కథనం