iPhone in Hundi : హుండీలో పడిపోయిన ఐఫోన్.. ఇక అది దేవుడిదే అంటున్న ఆలయ యాజమాన్యం!
22 December 2024, 7:20 IST
iPhone in Hundi : తిరుపోరూర్లోని శ్రీ కందస్వామి ఆలయంలో ఓ భక్తుడు హుండీలో పొరపాటున ఐఫోన్ పడేశాడు. ఇక ఆ ఫోన్ ఆలయానికి చెందినదని హెచ్ ఆర్ అండ్ సీఈ విభాగం పేర్కొంది. ఐఫోన్ ఇప్పుడు దేవుడి ఖాతాలో చేరిందని చెప్పింది. ఇది విని ఆ వ్యక్తి షాక్ అయ్యాడు.
హుండీలో పడిపోయిన ఐఫోన్..!
తమిళనాడులో జరిగిన ఒక వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుపోరూర్లోని శ్రీకాండస్వామి ఆలయానికి వెళ్లిన ఓ వ్యక్తి తన ఐఫోన్‌ని అనుకోకుండా హుండీలో పడేశాడు. దాన్ని తిరిగిచ్చేందుకు ఆలయ యాజమాన్యం నిరాకరించింది. ఇప్పుడు ఆ ఐఫోన్ దేవుడికి ఖాతాలోకి వెళ్లిందని చెప్పింది.
ఇదీ జరిగింది..
శుక్రవారం హుండీని తెరిచిన తర్వాత ఆలయ పాలకవర్గం దినేష్ అనే వ్యక్తిని సంప్రదించింది. హుండీలో గాడ్జెట్ కనిపించిందని, అందులోని డేటాను మాత్రమే తీసుకోవాలని, ఫోన్ ఇవ్వడం కుదరదని వారు చెప్పారు. అయితే అందుకు అంగీకరించని దినేష్.. తన ఐఫోన్‌ని తిరిగి ఇవ్వాలని పట్టుబట్టాడు.
ఈ విషయాన్ని శనివారం హెచ్ఆర్ అండ్ సీఈ మంత్రి పీకే శేఖర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా.. “హుండీలో జమ అయిన ప్రతిదీ, అది అనుకోకుండా జరిగినప్పటికీ, అది దేవుడి ఖాతాలోకి వెళ్తుంది,” అని బదులిచ్చారు.
“దేవాలయాల్లోని ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం హుండీలో సమర్పించిన డబ్బులు, వస్తువులు నేరుగా ఆ ఆలయ దేవుడి ఖాతాలోకి వెళతాయి. భక్తులు సమర్పించిన కానుకలను తిరిగి ఇచ్చేందుకు నిబంధనలు అనుమతించడం లేదు,” అని బాబు విలేకరులతో అన్నారు.
ఈ మాటలు విన్న సదరు ఐఫోన్ వినియోగదారుడు షాక్ అయ్యాడు! ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డాడు.
రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో మాధవరంలో మరియమ్మన్ ఆలయ నిర్మాణం, వేణుగోపాల్ నగర్‌లోని కైలాసనాథర్ ఆలయానికి చెందిన ఆలయ చెరువు పునరుద్ధరణ పనులను పరిశీలించిన అనంతరం దేవాదాయశాఖ అధికారులతో చర్చించి.. బాధితుడికి పరిహారం చెల్లించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ఇది మొదటిసారి కాదు..
రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. కేరళలోని అలప్పుజకు చెందిన ఎస్ సంగీత అనే భక్తురాలు 2023 మేలో పళనిలోని ప్రసిద్ధ శ్రీ ధన్దయుతపాణి స్వామి ఆలయంలోని హుండీలో ప్రమాదవశాత్తు తన బంగారు గొలుసును పడేసినట్లు సీనియర్ హెచ్ఆర్ అండ్ సీఈ అధికారి ఒకరు తెలిపారు.
ఆమె మెడలో ఉన్న తులసి దండను తొలగించడంతో గొలుసు హుండీలో పడిపోయింది. అయితే ఆమె ఆర్థిక పరిస్థితిని పరిశీలించి ప్రమాదవశాత్తు గొలుసు పడిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిర్ధారించిన ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ స్వయంగా అదే విలువ చేసే కొత్త బంగారు గొలుసును కొనుగోలు చేసి ఆమెకు ఇచ్చారు!