Manipur video : మణిపూర్ బాధితురాలి భర్త.. కార్గిల్ యుద్ధ వీరుడు! ‘దేశాన్ని రక్షించాను కానీ..’
22 July 2023, 7:16 IST
Manipur video parade viral : మణిపూర్ బాధితుల్లో ఒకరి భర్త.. మాజీ సైనికుడు! కార్గిల్ యుద్ధంలో భారత్ తరఫున పోరాడాడు. కానీ ఇప్పుడు.. సొంత భార్యను రక్షించుకోలేకపోయానని బాధపడుతున్నాడు.
మణిపూర్ బాధితురాలి భర్త.. కార్గిల్ యుద్ధ వీరుడు!
Manipur video parade viral : మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త బయటకొచ్చింది. బాధితులు ఇద్దరిలో ఓ మహిళ భర్త.. కార్గిల్ యుద్ధ వీరుడు! నాటి యుద్ధంలో ప్రాణాలకు తెగించి, దేశ రక్షణకు పాటుపడ్డారు. కానీ ఇప్పుడు.. భార్యను రక్షించుకోలేకపోయానని కుమిలిపోతున్నారు.
'దేశాన్ని రక్షించాను కానీ..'
మణిపూర్ వీడియోలోని మహిళ భర్త.. భారత సైన్యంలోని అసోం రెజిమెంట్లో సుబేదార్గా పనిచేశారు. కార్గిల్ యుద్ధంతో పాటు శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో విధులు నిర్వహించారు.
"దేశం కోసం నేను కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాను. శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్లోనూ బాధ్యతలు నిర్వర్తించాను. నేను దేశాన్ని కాపాడాను. కానీ రిటైర్మెంట్ తర్వాత.. నా ఇంటిని, నా భార్యను, నా తోటి గ్రామస్థులను కాపాడుకోలేకపోయాను. చాలా బాధగా ఉంది," అని ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో మే 4న జరిగిన ఘటనకు సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించారు.
Manipur woman paraded : "మే 4 ఉదయం.. ఓ గుంపు మా గ్రామంపై దాడి చేసింది. అనేక ఇళ్లను తగలబెట్టింది. అందరి ముందు ఇద్దరిని నగ్నంగా చేసి, ఊరేగించింది. పోలీసులు ఉన్నారు. కానీ చర్యలు తీసుకోలేదు. నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను," అని ఆయన అన్నారు.
మరో బాధితురాలి తల్లి ఆవేదన..
మణిపూర్ వీడియోలో ఉన్న మరో బాధితురాలి తల్లి, ఇటీవలే సంబంధిత ఘటనపై మాట్లాడారు. ఘటన తర్వాత చాలా క్షోభకు గురైనట్టు వివరించారు.
"నా భర్తను, కుమారుడిని చంపేశారు. నా ఆశలన్నీ కుమారుడిపైనే ఉండేవి. చాలా కష్టపడి అతనిని స్కూల్కు పంపించాము. 12వ తరగతి పాస్ అవుతాడని భావిచాను. వారిని చంపిన తర్వాత నా బిడ్డను నగ్నంగా చేసి ఊరేగించారు. నా పెద్ద కుమారుడికి ఉద్యోగం లేదు. నేను నిస్సహాయత స్థితిలో ఉన్నాను. ఇక మేము ఆ గ్రామానికి తిరిగి వెళ్లము. వెళ్లలేము. మా ఇళ్లను తగలబెట్టారు. పొలాలను నాశనం చేశారు. వెనక్కి వెళ్లి ఏం చేయాలి? గ్రామాన్నే తగలబెట్టేశారు. నా కుటుంబ భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా కోపంగా ఉంది. ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. దేశలోని తల్లిదండ్రులారా.. ఇదీ మా పరిస్థితి," అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మరో ఘటన..
Manipur victim family : హింసాత్మక ఘటనలతో దాదాపు మూడు నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్లో మరో దారుణం! కుకి జాతికి చెందిన ఓ వ్యక్తిని, కొందరు దుండగులు దారుణంగా చంపి, శరీరం నుంచి తలను వేరు చేశారు. అనంతరం దానిని ఇంటి ముందు వేలాడదీసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు తాజాగా వైరల్ అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.