Manipur women: మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా నడిపించిన దారుణం; ప్రధాన నిందితుడి అరెస్ట్
రెండు జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ లో ఒక దారుణం వెలుగు చూసింది. ఒక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను మరో వర్గానికి చెందిన వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన ఈ సంవత్సరం మే 4వ తేదీన జరిగింది.
రెండు జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ లో ఒక దారుణం వెలుగు చూసింది. ఒక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను మరో వర్గానికి చెందిన వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన ఈ సంవత్సరం మే 4వ తేదీన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు గురువారం పోలీసులు వెల్లడించారు.
పరిస్థితి ఉద్రిక్తం..
ఈ దారుణం మే 4వ తేదీన మణిపూర్ లోని కాంగ్ పోక్పి జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా నడిపిస్తుండడంతో పాటు వారిని కొడుతూ, దూషిస్తూ ఉండడం ఆ వీడియోలో కనిపిస్తుంది. తమను వదిలేయాలని ఆ అసహాయ మహిళలు ఏడుస్తూ, వేడుకుంటున్నా ఆ రాక్షసులు కనికరించలేదు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడంతో మణిపూర్ లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బాధిత మహిళలకు చెందిన వర్గం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుపుతోంది. ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం (ITLF) ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తోంది.
పోలీసు కేసు
మహిళలను నగ్నంగా నడిపించడానికి సంబంధించి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అపహరణ, సామూహిక అత్యాచారం తదితర నేరారోపణల కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశామని, ఇతర నిందితులను కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. వారిని పట్టుకోవడం కోసం ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనపై తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవాలని ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం (ITLF) డిమాండ్ చేస్తోంది. అలాగే, ఈ వీడియోను సు మోటో గా తీసుకుని దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
మే 3వ తేదీ నుంచి
మే 3వ తేదీ నుంచి మణిపుర్ లో జాతుల ఘర్షణలు ప్రారంభమయ్యాయి. కుకి, మైతీ తెగల మధ్య రిజర్వేషన్లకు సంబంధించి ప్రారంభమైన ఈ ఘర్షణలు అత్యంత తీవ్రమై, హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 160 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్ లో పర్వత ప్రాంతాల్లో కుకీల ఆధిపత్యం, ఇంఫాల్ లోయలో మైతీల ఆధిపత్యం ఉంటుంది. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను కుకి - జొ తెగల ప్రజలు తీవ్రంగా తీసుకున్నారు.