Viral | చుక్క నీరు కోసం అష్టకష్టాలు.. అయినా దాహం తీరదు!
06 April 2022, 19:01 IST
- మహారాష్ట్ర: ఎండా కాలంలో ఏసీల్లో కూర్చున్నా.. ఉక్కపోతగా ఉంటోందని కొందరు చెబుతూ ఉంటారు. కానీ దేశంలోని చాలా మంది.. చుక్క నీరు కూడా దొరకని స్థితిలో ఉన్నారు. మంచినీరు కోసం కిలోమీటర్లు బిందెలతో నడవాల్సిన పరిస్థితి ఇంకా ఉంది. కాగా మహారాష్ట్రలో ఓ మహిళ.. దాదాపు అడుగంటిపోయిన ఓ బావిలోకి దిగి.. ఉన్న కాస్త నీటిని సేకరించేందుకు సాహసం చేసింది.
చుక్క నీటి కోసం అష్టకష్టాలు..
Maharastra water scarcity | స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా.. దేశంలోనే అనేకమందికి చుక్క నీరు కూడా దొరకడం కష్టమవుతోంది. ముఖ్యంగా ఎండా కాలంలో అనేక ప్రాంతాల్లో కరవు పరిస్థితులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చేతుల్లో బిందెలు పట్టుకుని కిలోమీటర్లు ఎండల్లో నడుస్తూ వెళ్లి.. నీరు నింపుకుంటున్న దృశ్యాలు ఇప్పటికీ దర్శనమిస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. మంచినీరు కోసం ఓ మహిళ పెద్ద సాహసమే చేసింది! బావిలో దిగి నీరు సేకరించేందుకు కష్టాలు పడింది. కానీ ఆ బావి దాదాపు అడుగంటిపోవడం, మిగిలిన కొంత నీటిని సేకరించేందుకు ఆ మహిళ అంత కష్టపడాల్సి రావడం అత్యంత బాధాకరం.
ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మెట్ఘర్ గ్రామంలో చోటుచేసుకుంది. "మహిళలు ప్రాణాలకు తెగించి.. నీటి కోసం సాహసాలు చేస్తున్నారు. 2022లో కూడా ఈ విధంగా జరుగుతోంది," అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మహిళ.. బావిలోకి దిగుతున్న దృశ్యాలను ట్వీట్‌కి ట్యాగ్ చేశారు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మహిళ పరిస్థితిపై నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియోను ఇక్కడ చూడండి:
పేలుతున్న ఎండలు..
Maharashtra temperature | దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఉత్తరభారతంలో ఈ పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40డిగ్రీలు దాటిపోయాయి. అకోలా అనే ప్రాంతంలో 44డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం.
ఈ పరిస్థితులు ఇంకొన్ని రోజులు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. విదర్భా ప్రాంతంలో హీట్‌వేవ్ పరిస్థితులు ఈ నెల 10 వరకు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
టాపిక్