తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kolkata Murder Case : ఎన్‌టీఎఫ్‌పై నివేదిక కోరిన సుప్రీం కోర్టు.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సీరియస్

Kolkata Murder Case : ఎన్‌టీఎఫ్‌పై నివేదిక కోరిన సుప్రీం కోర్టు.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సీరియస్

Anand Sai HT Telugu

30 September 2024, 20:37 IST

google News
    • Supreme Court On Kolkata Murder Case : కోల్‌కతా ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ హత్యాచారం కేసుపై సుప్రీం కోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య, ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణలో కీలకమైన ఆధారాలు బయటపడ్డాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసును ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారించింది.

ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఆసుపత్రిలో సీసీటీవీల ఏర్పాటు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాల వద్ద ప్రత్యేక విశ్రాంతి గదుల నిర్మాణంలో ఆలస్యంపై మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పనులు ఎందుకు ఆలస్యంగా జరుగుతున్నాయని అడిగింది. మేం ఆగస్టు 9 నుండి పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. కొనసాగుతున్న పనిని అక్టోబర్ 15 లోపు పూర్తి చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సీసీటీవీల ఏర్పాటు, మరుగుదొడ్లు, ప్రత్యేక విశ్రాంతి గదుల నిర్మాణంతో సహా మౌలిక సదుపాయాలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పనితీరుపై సీజేఐ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన పనులు అక్టోబర్ 31 నాటికి పూర్తవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కోర్టు ఆదేశంతో అక్టోబర్ 15 నాటికి పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చింది.

విచారణ సందర్భంగా న్యాయవాది వృందా గ్రోవర్ మాట్లాడుతూ.. మరణించిన బాధితురాలి తల్లిదండ్రుల పేరు, ఫొటోలు సోషల్ మీడియాలో పదేపదే బహిర్గతం చేయడం వల్ల వారికి ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని, ఈ ఉత్తర్వును అమలు చేయాల్సిన బాధ్యత చట్టాన్ని అమలు చేసే సంస్థలకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ సందర్భంగా డాక్టర్ అత్యాచారం, హత్య, ఆర్థిక అవకతవకలపై సీబీఐ దర్యాప్తులో కీలకమైన ఆధారాలు వెలువడ్డాయని ధర్మాసనం పేర్కొంది. 'ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, ఇంకా దర్యాప్తులో ఉన్న వ్యక్తులు ఎవరు?' అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది.

విచారణ సందర్భంగా రెసిడెంట్ వైద్యులు ఇన్‌పేషెంట్ విభాగం, ఔట్ పేషెంట్ విభాగం పనులను చేయడం లేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆరోపించింది. రెసిడెంట్ డాక్టర్ల న్యాయవాది ఇందిరా జైసింగ్ దీనిని వ్యతిరేకించారు. వైద్యులు అన్ని అవసరమైన, అత్యవసర సేవలను నిర్వహిస్తున్నారని చెప్పారు.

ఆరోగ్య సంరక్షణ నిపుణుల భద్రత కోసం ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్(ఎన్‌టీఎఫ్) పురోగతిపై సవివరమైన నివేదికను సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది.

తదుపరి వ్యాసం