Siddipet : ఏడో తరగతి బాలికపై యువకుడు అత్యాచారం - నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన కుటుంబ సభ్యులు
ఏడో తరగతి బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని కొమురవెల్లి మండల పరిధిలో జరిగింది. ఆగ్రహించిన కుటుంబ సభ్యుల… నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఏడవ తరగతి బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొమురవెల్లి మండలం గురువన్నపేటలో ఈ దారుణం వెలుగుచూసింది.
వివరాల ప్రకారం గురువన్నపేట గ్రామానికి చెందిన ఏడవ తరగతి బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు ఎండి షర్బద్దీన్(22) అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన బాలిక కుటుంబసభ్యులు.. గ్రామస్థులు కలిసి నిందితుడి ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టారు.
అంతటితో ఆగకుండా ఆ యువకుడికి చెందిన వాహనాల అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారు. దీంతో గురువన్నపేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గ్రామస్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామస్తులను చెదరగొట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హత్యాయత్నం కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష:
హత్యాయత్నం కేసులో నిందితుడికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ గౌరవ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రాధా కృష్ణ చౌహాన్ తీర్పునిచ్చారు. సంగారెడ్డి ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా కల్వకుంట్ల గ్రామానికి చెందిన షేక్ సాబేర్ (30) బైక్ మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా కొండాపురం గ్రామానికి చెందిన మహమ్మద్ మోసిన్ షేక్ సాబెర్ వద్ద రూ. 10 వేల అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలో షేక్ సాబెర్ డబ్బుల విషయమై మహమ్మద్ మోసిన్ తో తరచూ గొడవపడుతూ.., బూతు మాటలు తిట్టేవాడు. అనంతరం 2018 అక్టోబర్ 15 న డబ్బుల విషయమై మాట్లాడడానికి షేక్ సాబెర్ ఇంటికి వెళ్ళగా వెనకాల నుండి వచ్చి గొడ్డలితో తలపై కొట్టి చంపేందుకు ప్రయత్నించాడు.
ఈ మేరకు బాధితుడు మోసిన్ సంగారెడ్డి పట్టాన పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అప్పటి ఎస్ఐ లక్ష్మారెడ్డి దర్యాప్తు చేసి కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో నిందితున్ని కోర్టులో ప్రవేశపెట్టాడు. కేసు పూర్వపరాలను విన్న గౌరవ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రాధా కృష్ణ చౌహాన్ నిందితునికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
జరిమానా చెల్లించడంలో విఫలమైతే 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. నిందితునికి శిక్షపడేలా కృషి చేసిన అధికారులను సంగారెడ్డి ఎస్పీ రూపేష్ అభినందించారు.