Hezbollah: హెజ్బొల్లా కు మరో ఎదురు దెబ్బ; ఇజ్రాయెల్ దాడుల్లో సీనియర్ కమాండర్ నబీల్ కౌక్ మృతి
29 September 2024, 17:10 IST
మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా పై దాడులను ఇజ్రాయెల్ మరింత తీవ్రం చేసింది. లెబనాన్ రాజధాని బీరుట్ లోని హెజ్బొల్లా స్థావరాలపై వరుస వైమానిక దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రుల్లా మృతి చెందిన అనంతరం, మరో సీనియర్ కమాండర్ కూడా ఆ దాడుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా సీనియర్ కమాండర్ నబీల్ కౌక్ మృతి
హెజ్బొల్లా కమాండర్ నబిల్ కౌక్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. అయితే, కౌక్ మరణాన్ని హెజ్బొల్లా ధృవీకరించలేదు. కానీ అతని మద్దతుదారులు శనివారం నుండి సంతాప సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్
నబిల్ కౌక్ హెజ్బొల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ గా పనిచేస్తున్నాడు. 1995 నుంచి 2010 వరకు దక్షిణ లెబనాన్ లో హెజ్బొల్లా సైనిక కమాండర్ గా కూడా నబిల్ కౌక్ పనిచేశారు. 2020లో ఆయనతో పాటు హిజ్బుల్లా కౌన్సిల్లోని మరో సభ్యుడు హసన్ అల్ బాగ్దాదీపై అమెరికా ఆంక్షలు విధించింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం నిర్వహించిన భారీ వైమానిక దాడిలో మట్టుబెట్టింది. హెజ్బొల్లా కీలక నాయకులను ఇజ్రాయెల్ చంపడం ఇదే మొదటిసారి కాదు. 1992లో నాటి హెజ్బొల్లా చీఫ్ అబ్బాస్ మౌసావిను ఇజ్రాయెల్ హెలికాప్టర్ దాడిలో హత్య చేసింది. మౌసావి మరణం అనంతరం హెజ్బొల్లా చీఫ్ బాధ్యతలను హసన్ నస్రల్లా స్వీకరించారు.
ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఘర్షణ
లెబనాన్ లోనిహెజ్బొల్లా స్థావరాలపై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. కాగా, హెజ్బొల్లా,ఇజ్రాయెల్ (israel) ఘర్షణ కారణంగా లెబనాన్ లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సుమారు 2,50,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి ప్రభుత్వ ఆధ్వర్యంలోని షెల్టర్లు, అనధికారిక షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ వివరాలను ఆ దేశ పర్యావరణ మంత్రి నాసర్ యాసిన్ తెలిపారు. నిజానికి ఈ ఘర్షణల కారణంగా నిరాశ్రయులైన వారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందన్నారు.
లెబనాన్ లో సంక్షోభం
లెబనాన్ లో శుక్రవారం నాటికి 2,11,319 మందిని బలవంతంగా తరలించామని, ఇటీవలి రోజుల్లో బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ముందు ఇది జరిగిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. లెబనాన్ ప్రభుత్వం పాఠశాలలు, ఇతర సౌకర్యాలను తాత్కాలిక షెల్టర్లుగా మార్చింది. అయినప్పటికీ, చాలా మంది ఇజ్రాయెల్ వైమానిక దాడుల భయంతో వీధుల్లో లేదా బహిరంగ కూడళ్లలో ఆశ్రయం పొందుతున్నారు.