Israel Strikes : లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 356 మందికి పైగా మృతి
24 September 2024, 6:14 IST
- Lebanon : లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు జరిపింది. హిజ్బూల్లా గ్రూప్ స్థావరాలే లక్ష్యంగా జరిపిన ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 24 మంది చిన్నారులు కూడా ఉన్నారు. చాలా మంది గాయాలపాలయ్యారు.
బెకా లోయలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు
ఇజ్రాయెల్ సోమవారం దక్షిణ, తూర్పు లెబనాన్‌లో వందలాది వైమానిక దాడులను ప్రారంభించింది. 24 మంది పిల్లలు, 42 మంది మహిళలతో సహా 356 మందికి పైగా మరణించారు. హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఆయుధాలు నిల్వ ఉంచిందని కొన్ని ప్రదేశాలను ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. ఆ ప్రదేశాలను ఖాలీ చేయాలని నివాసితులకు సూచించింది. చాలా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.
దక్షిణ లెబనాన్‌లోని వివిధ గ్రామాల నివాసితులు తమ పట్టణాలను వైమానిక దాడులు తాకినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేశారు. హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌లోకి 100కి పైగా రాకెట్‌లను ప్రయోగించిన ఒక రోజు తర్వాత ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. మరోవైపు సోమవారం ఉదయం నుంచే ఇజ్రాయెల్ దాడులు మెుదలుపెట్టిందని లెబనాన్ ప్రకటించింది. దాడలను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఐరాసతోపాటు ఇతర దేశాలను కోరింది.
మజ్జాల్ సేలం, హులా, తౌరా, క్లయిలే, హారిస్, నబీ చిట్, హర్బాటాతోపాటు పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయి. మరణించిన వారిలో పిల్లలు, మహిళలు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారని లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దక్షిణ ప్రాంతంలో హిజ్బుల్లా ఆయుధాలు నిల్వచేసిన ప్రాంతాలను ప్రజలు వెంటనే వీడాలని ఇజ్రాయెల్ పేర్కొంది. బేకా లోయ ప్రాంతాంలో భారీగా దాడులు చేసింది. దానికి ముందు హెచ్చరిక జారీ చేసింది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చాలా మంది ప్రజలు అక్కడి నుంచి పారిపోయారు. లెబనాన్ రాజధాని బీరూట్‌లోనూ దాడులు చేపట్టినట్టుగా ఇజ్రాయెల్ తెలిపింది.
ఈ ఉద్రిక్తల నేపథ్యంలో 40వేల మంది సైనికులను పశ్చిమాసియాలో మోహరించింది అమెరికా. మరింత మందిని పంపేందుకు సిద్ధమైంది. మరోవైపు ఈ విషయంపై ఐరాస స్పందించింది. కాల్పుల విరమణపై ఇరుపక్షాలు ఆసక్తిగా లేరని స్పష్టమవుతుందని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.
గత వారం ప్రధానంగా హిజ్బుల్లా సభ్యులు ఉపయోగించే వేలాది సమాచార పరికరాలు లెబనాన్‌లోని వివిధ ప్రాంతాల్లో పేలి 39 మంది మరణించారు. దాదాపు 3,000 మంది గాయపడ్డారు.