Israel attack Iran : ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతికారం- వాయు దాడులతో మరింత పెరిగిన ఉద్రిక్తత!
26 October 2024, 7:31 IST
Israel Iran war : అక్టోబర్ 1న ఇరాన్ చేసిన వైమానిక దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది! శనివారం తెల్లవారుజామున ఇరాన్‌పై ఇజ్రాయెల్ వాయుదాడులు చేసింది!
లెబనాన్‌లో ఇజ్రాయెల్ వాయుదాడి చిత్రం..
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తాజాగా మరో కీలక మలుపు తిరిగాయి! శనివారం తెల్లవారుజామున ఇరాన్‌పై వాయు దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించడం ఇందుకు కారణం. అక్టోబర్ 1న తమపై ఇరాన్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు చేపట్టినట్టు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
తాజా వాయు దాడులు ఇరాన్‌ని ఏ మాత్రం ప్రభావితం చేశాయన్న విషయంపై తక్షణ సమాచారం లేదు. అయితే, ఈ దాడిని ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై ‘ప్రిసైస్ స్ట్రైక్స్’గా ఇజ్రాయెల్ సైన్యం అభివర్ణించింది.
ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్‌లోని ప్రభుత్వం నెలల తరబడి చేస్తున్న వరుస దాడులకు ప్రతిస్పందనగా ప్రస్తుతం ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై కచ్చితమైన దాడులు జరుపుతున్నాయని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగరి ఒక టెలివిజన్ ప్రకటనలో తెలిపారు.
కానీ ఇరాన్ మాత్రం దాడులను ఇంకా ధ్రువీకరించలేదు. పైగా, టెహ్రాన్ చుట్టుపక్కల వినిపించిన శబ్దాలు తమ వైమానిక రక్షణ చర్యల ఫలితంగా సంభవించాయని ఇరాన్ సైన్యం తెలిపింది.
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు..
"ఇరాన్ నేల నుంచి ప్రత్యక్ష దాడులతో సహా ఆ దేశ ప్రభుత్వం, ఈ ప్రాంతంలోని దాని ప్రతినిధులు అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్‌పై నిర్విరామంగా దాడి చేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని సార్వభౌమ దేశాల మాదిరిగానే ఇజ్రాయెల్ దేశానికి.. స్పందించే హక్కు, కర్తవ్యం ఉంది,' అని ఐడీఎఫ్ పేర్కొంది.
ఇజ్రాయెల్ రక్షణ, దాడి సామర్థ్యాలను పూర్తిగా సమీకరించినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి తెలిపారు. ఇజ్రాయెల్ దేశాన్ని, తమ ప్రజలను కాపాడేందుకు తాము చేయాల్సిందంతా చేస్తామని ఆయన చెప్పారు.
మరోవైపు రాజధాని టెహ్రాన్ చుట్టుపక్కల పలు బలమైన పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. సమీపంలోని కరాజ్ నగరంలో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని సెమీ-అధికారిక ఇరాన్ మీడియా తెలిపింది.
టెహ్రాన్ ఆకాశంలో రాకెట్లు లేదా విమానాల శబ్దం విన్నట్లు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదని తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది.
ఇరాన్ గగనతల రక్షణా వ్యవస్థను క్రియాశీలం చేయడం వల్లనే ఈ భారీ పేలుళ్లు సంభవించి ఉండొచ్చని పేరు చెప్పని ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులను ఉటంకిస్తూ స్టేట్ టీవీ పేర్కొంది.
ఇరాన్‌పై ఎలాంటి దాడి చేసినా దీటుగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధికారులు ఇజ్రాయెల్‌ను ఇప్పటికే పదేపదే హెచ్చరిస్తున్నారు.
అటు ఇజ్రాయెల్‌కు హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తే శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరించారు.
ఇరాన్‌లోని టార్గెట్స్‌పై దాడులకు ముందు అమెరికాకు ఇజ్రాయెల్ సమాచారం ఇచ్చిందని, అయితే ఈ ఆపరేషన్‌లో తాము పాల్గొనలేదని అమెరికా అధికారి ఒకరు రాయిటర్స్‌కు తెలిపారు.
“స్వీయ రక్షణ చర్యల్లో భాగంగా, అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై లక్ష్యంగా దాడులు చేస్తోంది అని మేము అర్థం చేసుకున్నాము," అని వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి సీన్ సావెట్ తెలిపారు.
గత కొన్ని వారాలుగా గాజాలో పాలస్తీనా మిలిటెంట్లు హమాస్, లెబనాన్‌లో ఇరాన్ మద్దతు కలిగిన మిత్రదేశం హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ తన దాడిని ముమ్మరం చేసింది. ఏడాది క్రితం 2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడితో ఈ ఉద్రిక్తత ప్రారంభమైంది.