Dombivli MIDC factory blasts: డోంబివ్లీ ఫ్యాక్టరీ పేలుళ్లలో 8 మంది మృతి, 60 మందికి గాయాలు-eight killed 60 injured in dombivli midc factory blasts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dombivli Midc Factory Blasts: డోంబివ్లీ ఫ్యాక్టరీ పేలుళ్లలో 8 మంది మృతి, 60 మందికి గాయాలు

Dombivli MIDC factory blasts: డోంబివ్లీ ఫ్యాక్టరీ పేలుళ్లలో 8 మంది మృతి, 60 మందికి గాయాలు

HT Telugu Desk HT Telugu
May 24, 2024 09:41 AM IST

మహారాష్ట్రలో ఉన్న థానే జిల్లాలోని డోంబివ్లీ ఎంఐడీసీ కాంప్లెక్స్ లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం మధ్యాహ్నం జరిగిన పలు బాయిలర్ పేలుళ్లలో ఇద్దరు కార్మికులు సహా ఎనిమిది మంది మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

డోంబివ్లీ ఎంఐడీసీ కాంప్లెక్స్ లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో పేలుళ్లు
డోంబివ్లీ ఎంఐడీసీ కాంప్లెక్స్ లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో పేలుళ్లు

Dombivli blasts: మహారాష్ట్రలో ఉన్న థానే జిల్లాలోని డోంబివ్లీ ఎంఐడీసీ కాంప్లెక్స్ లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం మధ్యాహ్నం జరిగిన పలు బాయిలర్ పేలుళ్లలో ఇద్దరు కార్మికులు సహా ఎనిమిది మంది మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో మరింత మంది కార్మికులు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీ యజమానులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఈ ఘటనలో గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

అముదాన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో పేలుళ్లు

హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగించి వివిధ రంగులు, షేడ్స్ తయారు చేసే మలయ్ మెహతాకు చెందిన 44 ఏళ్ల అముదాన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో గురువారం మధ్యాహ్నం పేలుళ్లు సంభవించాయని ఎంఐడీసీ అధికారి ఒకరు తెలిపారు. ఆ సమయంలో ఫ్యాక్టరీలో మేనేజర్, ఆరుగురు కార్మికులు, ముగ్గురు వాచ్ మెన్ సహా 10 మంది ఉద్యోగులు ఉన్నారు. మొదటి పేలుడు మధ్యాహ్నం 1.40 గంటలకు నమోదైంది. ఆ తరువాత మరో రెండు పేలుళ్లు జరిగాయి. కాగా, సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక దళ అధికారులు కనీసం నాలుగు పేలుళ్లు ఒకదాని తర్వాత ఒకటి సంభవించాయని చెప్పారు. ఈ పేలుళ్లు ఎంత శక్తిమంతమైనవంటే.. 4 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇళ్ల తలుపులు, కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. దాంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు.

సమీప ప్రాంతాలపై ప్రభావం

అముదాన్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న విఘ్నహర్త సొసైటీ నివాసి విజయ్ సాహు మాట్లాడుతూ, "నేను నా రెండేళ్ల కుమారుడితో కిటికీ దగ్గర నిద్రిస్తున్నప్పుడు పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. కిటికీ అద్ధం పగిలిపోయి నా కుమారుడిపై పడింది" అని చెప్పారు. అముదాన్ ఫ్యాక్టరీకి సమీపంలో ఉన్న మరో 12 నుంచి 15 హౌసింగ్ సొసైటీలపై కూడా ఈ పేలుళ్ల ప్రభావం పడింది. ప్రతి సొసైటీలో చెందిన దాదాపు 30-40 మంది ఫ్లాట్ యజమానులు తమ ఇళ్లల్లో తలుపులు, కిటికీల అద్దాలు పగిలిపోయాయని తెలిపారు.

కారణం తెలియలేదు..

అముదాన్ ఫ్యాక్టరీ పేలుళ్ల కారణంగా, అంబర్ కెమికల్ కంపెనీ, ఎంకేజీ, మెట్రోపాలిటన్ సహా చుట్టుపక్కల ఫ్యాక్టరీలను భారీ మంటలు చుట్టుముట్టాయని, పేలుడు జరిగిన ప్రాంతం నుంచి భారీగా పొగలు వ్యాపించాయని అధికారులు తెలిపారు. కల్యాణ్-డోంబివ్లీ అగ్నిమాపక దళం, థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (టీడీఆర్ఎఫ్) సిబ్బంది మంటలను ఆర్పేందుకు దాదాపు 30 నిమిషాల పాటు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లలేకపోయారు. వారు లోపలికి వెళ్లి చూడగా లోపల నిల్వ ఉంచిన రసాయనాలతో నిండిన పలు డ్రమ్ములు ఒకదాని తర్వాత ఒకటి పేలినట్లు గుర్తించారు. దాదాపు ఎనిమిది గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు.

వరుసగా నాలుగుకు పైగా పేలుళ్లు

వరుసగా నాలుగుకు పైగా పేలుళ్లు జరిగాయని, దీంతో మంటలు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక దళ అధికారి నామ్ దేవ్ చౌదరి తెలిపారు. డోంబివలి ఎంఐడీసీకి చెందిన రెండు ఫైర్ ఇంజిన్లు, కల్యాణ్-డోంబివ్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఐదు ఫైరింజన్లు, థానేకు చెందిన ఒక అగ్నిమాపక వాహనాన్ని రంగంలోకి దించారు. ఇప్పటి వరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. కానీ లోపల మరిన్ని మృతదేహాలు చిక్కుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి' అని చౌదరి తెలిపారు. మృతుల్లో అముదాన్ కెమికల్స్ లో పనిచేస్తున్న రిద్ధి ఖాన్విల్కర్ (36), పొరుగున ఉన్న అంబర్ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్న రోహిణి కదమ్ (26) అనే మహిళ ఉన్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని కేడీఎంసీ హెల్త్ ఆఫీసర్ దీపా శుక్లా చెప్పారు. క్షతగాత్రులను ఐదు వేర్వేరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించారు.

5 లక్షల పరిహారం

ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమత్, స్థానిక ఎమ్మెల్యే రాజు పాటిల్ తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన అన్ని కంపెనీల కార్యకలాపాలను నిలిపివేస్తున్నాం. వారు తమ కర్మాగారాలను నివాస ప్రాంతాలకు దూరంగా మార్చవచ్చు లేదా వారి వ్యాపారాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇంజనీరింగ్ కు మార్చవచ్చు" అని షిండే చెప్పారు. ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్లు సక్రమంగా జరిగాయా లేదా అనే దానిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు.

Whats_app_banner