Auto-brewery syndrome: ‘అతడి బాడీ ఒక ఆల్కహాల్ ఫ్యాక్టరీ; సొంతంగా లిక్కర్ తయారు చేసుకుంటుంది’
శరీరం సొంతంగా ఆల్కహాల్ ను తయారు చేసుకునే అరుదైన వ్యాధి అయిన ఆటో బ్రూవరీ సిండ్రోమ్ తో బెల్జియంకు చెందిన ఒక వ్యక్తి బాధపడుతున్నాడు. ఆ వ్యక్తి మద్యం తాగకపోయినా, అతడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు కావడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది.
బెల్జియం కు చెందిన ఒక వ్యక్తి ఆటో బ్రూవరీ సిండ్రోమ్ (ABS)తో బాధపడుతున్నాడు. అంటే, అతడు మద్యం తాగకపోయినా, అతడి శరీరంలో ఆటోమేటిక్ గా మద్యం తయారవుతుంది. దాంతో, అతడు ఎప్పుడు మద్యం సేవించినవాడి వలే ఉండేవాడు. నిజానికి, మొదట్లో మితిమీరి మద్యం తాగినప్పటికీ.. ఆ తరువాత ఆ అలవాటును అతడు వదిలేశాడు. అతడు ఒక మద్యం తయారీ కంపెనీ (brewery) లో పని చేస్తున్నాడు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు
ఒకరోజు వాహనం నడుపుతుండగా, మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నాడని అతడిపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. అయితే, తన క్లయింట్ ఆటో బ్రూవరీ సిండ్రోమ్ (ABS)తో బాధపడుతున్నాడని న్యాయవాది కోర్టుకు రుజువులతో సహా తెలియజేయడంతో, ఆ వ్యక్తిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అతడిని స్వతంత్రంగా పరీక్షించిన ముగ్గురు వైద్యులు అతను ఏబీఎస్ తో బాధపడుతున్నట్లు ధ్రువీకరించారు.
తాగకపోయినా.. తూలుతుంటారు..
ఆటో బ్రూవరీ సిండ్రోమ్ (ABS)తో బాధపడుతున్నవారు ఆల్కహాల్ డ్రింక్స్ లో మాదిరిగానే ఆల్కహాల్ ను ఉత్పత్తి చేస్తారని, కానీ వారు సాధారణంగా దాని ప్రభావాలను తక్కువగా అనుభవిస్తారని బెల్జియం ఆసుపత్రి ఎజెడ్ సింట్-లుకాస్ క్లినికల్ బయాలజిస్ట్ లిసా ఫ్లోరిన్ తెలిపారు. ఏబీఎస్ సమస్య జన్మత: రాదని చెప్పారు. ఇప్పటికే మరొక ప్రేగు సంబంధిత పరిస్థితితో బాధపడుతున్నప్పుడు ఈ సమస్య ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ సమస్యతో బాధ పడుతున్నవారు, శారీరకంగా, మానసికంగా అతిగా మద్యం సేవించిన వారి తరహాలోనే ప్రవర్తిస్తారు.