తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  One Nation- One Election : దేశంలో జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మేనా?

One nation- one election : దేశంలో జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మేనా?

HT Telugu Desk HT Telugu

24 September 2023, 13:31 IST

google News
    • One nation one election : దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నికలపై విపరీతంగా చర్చ జరుగుతోంది. అసలు దేశంలో ఈ ప్రక్రియ సాధ్యమేనా? లాభాలేంటి? నష్టాలేంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
 దేశంలో జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మేనా?
దేశంలో జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మేనా?

దేశంలో జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మేనా?

One nation one election : జమిలి ఎన్నికల (ఒకే దేశం-ఒకే ఎన్నిక‌)పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం క‌మిటీ వేయ‌డంతో ఏక‌కాలంలో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నే ప్ర‌తిపాద‌న‌ల‌పై మ‌రోసారి స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.  2018లో కూడా ఇలానే ఈ అంశంపై చ‌ర్చ జ‌రిగింది. అ చ‌ర్చ ఈనాటి కాదు. గ‌తంలో కూడా జ‌మిలి ఎన్నిక‌ల‌పై చ‌ర్చ జ‌రిగింది. భార‌త‌దేశానికి కూడా జ‌మిలి ఎన్నిక‌లు ఏమీ కొత్తేమీ కాదు. దేశంలో ఏక‌కాల ఎన్నిక‌లు జ‌రిగిన చ‌రిత్ర కూడా ఉంది. అయితే మారిన ప‌రిస్థితుల్లో దేశంలో ప్ర‌స్తుతం లోక్‌స‌భ‌కు, రాష్ట్ర శాస‌న స‌భ‌ల‌కు (నాలుగు రాష్ట్రాలు మిన‌హా) వేర్వేరుగా జ‌రిగే ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. రాజ్యాంగం గురించి కొద్దిపాటి అవగాహన ఉన్నవారెవరైనా ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం జమిలి ఎన్నికలు సాధ్యం కావని చెప్పగలరు. అయితే నాలుగేళ్లుగా ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు ఎన్నికల సంఘం రెండు కూడా చాలా తెలివిగా ముసాయిదా విధానం ప్రకటించకుండా కేవలం జమిలి ఎన్నికలు చర్చించవలసిన అంశం అనే సంకేతాలు వదులుతూ వస్తున్నాయి.

ఏక‌కాల ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న‌

దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న 1983లో ఎన్నిక‌ల సంఘం తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సూచ‌న కూడా చేసింది. బిజెపి సీనియ‌ర్ నేత ఎల్‌కె అద్వానీ ఉప ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. 2012లో అప్ప‌టి రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖర్జీకి అద్వానీ లేఖ కూడా రాశారు. బిజెపి 2014 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో జ‌మిలి ఎన్నిక‌ల అంశాన్ని పేర్కొంది. 2014లో అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మోడీ స‌ర్కార్ అధికారిక చ‌ర్చను లేవ‌దీసింది. ప్ర‌ధాని మోడీ ప‌లు వేదిక‌ల‌పై జ‌మిలి ఎన్నిక‌ల అంశాన్ని మాట్లాడారు. అంతేకాదు లోక్‌స‌భ‌, రాష్ట్రాల అసెంబ్లీల‌తో పాటు స్థానిక సంస్థ‌లు (పంచాయ‌తీ, మున్సిపాల్‌) ఎన్నిక‌లు కూడా ఒకేసారి జ‌ర‌గాల‌ని పేర్కొన్నారు. 2015లో ప‌ర్స‌న‌ల్‌, ప‌బ్లిక్ గ్రీవెన్స్ లా అండ్ జ‌స్టిస్ పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ జ‌మిలి ఎన్నిక‌ల సాధ్యాసాధ్యాల‌పై 79వ నివేదిక పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పించింది. అలాగే ఇదే అంశంపై నీతి ఆయోగ్ 36 పేజీల‌తో కూడిన రిపోర్టు విడుద‌ల చేసింది. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా వెబ్ పోర్ట‌ల్ (ఎంవైజిఒవి) ఏర్పాటు చేసింది. మోడీ స‌ర్కార్ హ‌యంలో రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ గ‌ణ‌తంత్ర వేడుక‌ల ప్ర‌సంగంలో జిలి ఎన్నిక‌ల అంశాన్ని ప్ర‌స్తావించారు. ఆ త‌రువాత రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ తొలిసారి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ సమావేశాలు ప్రారంభించేందుకు జ‌రిగిన పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల సంయుక్త స‌మావేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌పై దేశంలో చ‌ర్చ జ‌ర‌గాల‌ని మ‌రోసారి ఈ అంశాన్ని చ‌ర్చ‌కు లేవ‌నెత్తారు.

జ‌మిలి ఎన్నిక‌లు కొత్తేమీ కాదు

One nation one election BJP : వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తమీ కాదు. 1951-52లో తొలి సార్వ‌త్రిక‌ ఎన్నికలు (లోక్‌స‌భ‌), రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు ఏక‌కాలంలోనే జ‌రిగాయి. 1953-54 మ‌ధ్య పంజాబ్‌లో రాష్ట్రప‌తి పాల‌న సాగింది. మ‌రోవైపు ట్రావెన్‌కోర్ కొచ్చిన్ ఉన్న ప్రాంతం 1956 న‌వంబ‌ర్ 1న కేర‌ళ రాష్ట్రంగా ఆవిర్భ‌వించింది. అక్క‌డ కూడా రాష్ట్రప‌తి పాల‌న విధించారు. 1967 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల్లో దేశంలోనే తొలిసారి క‌మ్యూనిస్టు పార్టీ నాయ‌కత్వంలో ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. క‌మ్యూనిస్టు యోధుడు ఈఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్య‌మంత్రి అయ్యారు. 1959లో కేంద్రంలోని అప్ప‌టి జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ప్ర‌భుత్వం 356 అధిక‌ర‌ణ‌ను ప్ర‌యోగించి కేర‌ళ‌లోని క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వాన్ని మొగ్గ‌లోనే తుంచేసింది. ఆ మ‌రుస‌టి ఏడాదే అక్క‌డ మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌చ్చాయి. 1962లో మూడో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగాయి. అంత‌కు ముందేడాది 1961లో ఒరిస్సాలోని ప్ర‌భుత్వం కుప్ప‌కూలి అక్క‌డ అసెంబ్లీకి మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయితే ప్ర‌స్తుతం ఒరిస్సా అసెంబ్లీ ఎన్నిక‌లు లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తోనే పాటే జ‌రుగుతున్నాయి. 1951, 57, 62, 67 మొద‌టి నాలుగు లోక్‌స‌భ ఎన్నిక‌ల ఏక‌కాలంలోనే జ‌రిగాయి. మొద‌టి మూడు లోక్‌స‌భ‌, అసెంబ్లీలు ఐదేళ్ల పాటు పూర్తికాలం పాల‌న సాగించాయి. 1967 త‌రువాత త‌ర‌చూ రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ప‌డిపోవ‌డం, ఎన్నిక‌లు రావ‌డం ఒక ధోర‌ణిగా మారింది. 1968లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, 1969లో మ‌రికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు అర్థాంత‌రంగా ర‌ద్దు కావ‌డంతో అవి లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో సంబంధం లేకుండా జ‌రిగాయి. 1969లో కాంగ్రెస్‌లో చీలిక వ‌ల్ల దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ప‌డిపోయాయి. 1970లో నాటి ప్ర‌ధాన మంత్రి ఇందిరా గాంధీ లోక్‌స‌భ‌ను ర‌ద్దు చేయ‌డంతో మధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌చ్చాయి. 1971లో లోక్‌స‌భ‌కు ఎన్నిక‌ల జ‌ర‌గ‌డంతో లోక్‌స‌భ‌, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్తిగా వేరైపోయాయి. 1975లో ఇందిరా గాంధీ 352 అధ‌ఙ‌క‌ర‌ణ‌ను ప్ర‌యోగించి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి (ఎమ‌ర్జెన్సీ)ని విధించి లోక్‌స‌భ గ‌డువును ఏడాది పొడిగించింది. 1977లో అప్ప‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి జ‌న‌తా పార్టీ నేతృత్వంలో మొరార్జీ దేశాయి ప్ర‌ధాన మంత్రిగా తొలి కాంగ్రెసేత‌ర ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆ ప్ర‌భుత్వం కూడా మ‌ధ్య‌లోనే కూలిపోయింది. మొరార్జీ దేశాయి, విపి సింగ్‌, హెచ్‌డి దేవ‌గౌడ ప్ర‌భుత్వాలు పూర్తికాలం పరిపాల‌న సాగ‌కుండానే మ‌ధ్య‌లోనే కూలిపోయాయి. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలుండ‌గా ప్ర‌స్తుతం లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీల‌కు కూడా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. గ‌తంలో తెలంగాణ ఏర్పడిన త‌రువాత మొద‌టి అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా 2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తోనే జ‌రిగాయి. అయితే ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్‌రావు అసెంబ్లీని 2018లో ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు లోక్‌స‌భ ఎన్నిక‌లకు ముందే జ‌రుగుతున్నాయి.

కేవలం 4 రాష్ట్రాల‌కు మాత్ర‌మే లోక్‌స‌భ‌తో పాటు ఎన్నిక‌లు

1951-52 లో లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల‌తో పాటు 90 శాతం రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఏకకాలంలోనే ఎన్నిక‌లు జ‌రిగాయి. 1957లో 76 శాతం జ‌రిగగా, 1967లో 67 శాతం, 2019 నాటికి లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌రిగి రాష్ట్రాల సంఖ్య‌ 15 శాతానికి త‌గ్గాయి. నాలుగు రాష్ట్రాలు మిన‌హా మిగిలిన 24 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో జ‌ర‌గ‌టం లేదు. ఈ ర‌కంగా లోక్‌స‌భ‌, రాష్ట్ర శాస‌న స‌భ ఎన్నిక‌ల‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాంటే, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ముందుకు జ‌ర‌పాలి. మ‌రికొన్ని రాష్ట్రాల అసెంబ్లీల‌ను వెన‌క్కి జ‌ర‌పాలి. అలా చేయ‌డం వ‌ల్ల భార‌త రాజ్యాంగం సూచిస్తున్న ఐదేళ్ల అసెంబ్లీల కాల ప‌రిమితి కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో తగ్గుతుంది. ఇది రాజ్యాంగ ఉల్లంఘ‌న అవుతుంది. లోక్‌స‌భ‌, రాష్ట్ర శాస‌న స‌భ‌ల ప‌ద‌వీకాలాన్ని పొడిగించేందుకు చేసే ఏ ప్ర‌య‌త్న‌మైనా ప్ర‌జాస్వామ్యానికి వ్య‌తిరేక‌మైంది.

రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు కూలితే?

One nation one election in India : లోక్‌స‌భ‌, రాష్ట్ర శాస‌న స‌భ‌ల‌కు, ఇంకా అవసరమైతే స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన పైకి మంచిగానే కనబడుతున్నప్పటికీ, లోతుగా విశ్లేషిస్తే, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్యస్ఫూర్తికి ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. ‘ఐదేళ్ల‌ కాలానికి ఎన్నికైన ఏదైనా ప్రభుత్వం మధ్యలో కూలిపోతే ఏం చేయాలి? అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే కొత్త ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి అధికారం చేపడుతుంది. అప్పుడు ఏకకాల ఎన్నికల వ్యవస్థ (జమిలి) లక్ష్యం దెబ్బతింటుంది. ఇలా జరుగకుండా ఉండాలంటే, కొత్త ప్రభుత్వం కాలపరిమితిని కుదించాల్సి ఉంటుంది. ఇది ప్రజాతీర్పుకు, సమాఖ్యస్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలి పెట్టులాంటిది.

లోక్‌స‌భ ర‌ద్దైతే?

రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన కచ్చితత్వంతో లేదు. లోక్‌సభ విధివిధానాల్లోని 198వ నిబంధనలో మాత్రమే దాన్ని ప్రస్తావించారు. 50 లేదా అంతకంటే ఎక్కువ మంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం గద్దె దిగాల్సిఉంటుంది. ఏ వర్గమూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేనప్పుడు సభను రద్దుచేసి మధ్యంతర ఎన్నికలు జరుపడమే మార్గం. మరి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనిపై 1999లో లా కమిషన్‌ ఓ సిఫారసు చేసింది. ఈ మేరకు జర్మనీ రాజ్యాంగాన్ని ఉదహరించింది. దాని ప్రకారం జర్మనీలో అవిశ్వాస తీర్మానంతో పాటు విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతారు. అంటే, ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించేవారు. ఎవరు నెగ్గుతారో కూడా చెప్పాలి. ఈ రెండు తీర్మానాలను సభ ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు కొత్త చాన్సలర్‌ను నియమిస్తారు. ప్రభుత్వాలు మారినా ఐదేంళ్ల పాటు సభ కొనసాగుతుంది. అయితే, జర్మనీలో అధ్యక్ష పాలన అమల్లో ఉన్నది. మనది ప్రజాస్వామ్య దేశం. దీంతో ఈ సిఫారసును పక్కనబెట్టారు. అవిశ్వాస తీర్మానంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే, జమిలి ఎన్నికల నెపంతో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమూలేకపోలేదు.

ఏక‌కాల ఎన్నిక‌లు-స‌మ‌స్య‌లు

ఏక‌కాల ఎన్నిక‌ల విధానం కొన‌సాగాలంటే లోక్‌స‌భ‌గానీ, రాష్ట్ర అసెంబ్లీలుగానీ నిర్దిష్ట కాల ప‌రిమితిలోగా ర‌ద్దు కాకుండా చూసుకోవాలి. అందుకు అనువుగా రాజ్యాంగంలో స‌వ‌ర‌ణ‌లు తీసుకురావాల్సి ఉంటుంది. కాల ప‌రిమితిలోగా స‌భ ర‌ద్దు కాకూడ‌దంటే పార్ల‌మెంట్ నిబంధ‌న‌ల్లో ముఖ్య‌మైన అవిశ్వాస తీర్మానాన్ని అనుమ‌తించ‌కూడ‌దు. అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. అనుమ‌తిస్తే ప్ర‌భుత్వం కూలిపోవ‌చ్చు. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే వ‌ర‌కు రాష్ట్రప‌తి పాల‌న విధించాలి. అనివార్య కార‌ణాల‌తో లోక్‌సభ ర‌ద్దు అయినా, ప‌ద‌వీకాలం పొడిగింపు అసాధ్య‌మైనా దేశ పాల‌నా బాధ్య‌త‌లు రాష్ట్రప‌తి చేతుల్లోకి వెళ్తాయి. త‌ద్వారా దేశంలో అధ్య‌క్ష పాల‌న‌ను దొడ్డిదారిన ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు అవుతుంది. ఇది ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధ‌మైన‌ది. ఎన్నిక‌లు జ‌రిగిన రెండేళ్ల‌లోపే ప్ర‌భుత్వం ప‌డిపోతే, అందుకు నిర్ధిష్ట‌మైన ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు లేవు. ఏక‌కాల ఎన్నిక‌లు అమ‌లైతే జాతీయ స‌మ‌స్య‌లు, విధానాలే త‌ప్ప‌, రాష్ట్ర, ప్రాంతీయ స‌మ‌స్య‌ల‌కు అంత ప్రాధాన్య‌త ఉండ‌దు. ఇది స‌మాఖ్య స్ఫూర్తికి విఘాతం క‌ల్పిస్తుంది. అలాగే 1992లో 73, 74 రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల‌తో ఏర్ప‌డిన రాష్ట్రాల ఎన్నిక‌ల క‌మిష‌న్ (ఎస్ఈసి)లు ర‌ద్దు అయ్యే ప్ర‌మాదం ఉంది.

జ‌మిలి ఎన్నిక‌ల‌కు అవరోధాలు, అడ్డంకులు

జ‌మిలి ఎన్నిక‌ల‌పై ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో ఇటీవ‌లి రాజ్యసభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికలు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం కష్టమని పేర్కొన్నారు. ''ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అంత సులువు కాదు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల లాభాలు ఉన్నప్పటికీ అందుకు అనేక కీలక అవరోధాలు, అడ్డంకులు కూడా ఉన్నాయి. కనీసం ఐదు కీలక రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో పార్లమెంట్‌ ఉభయ సభల వ్యవధికి సంబంధించిన ఆర్టికల్‌ 83, లోక్‌సభ రద్దు చేయడానికి రాష్ట్రపతికి ఉన్న అధికారాలకు సంబంధించిన ఆర్టికల్‌ 85, రాష్ట్ర శాసన సభల కాల వ్యవధికి సంబంధించిన ఆర్టికల్‌ 172, రాష్ట్రాల శాసన సభలు రద్దు సంబంధించిన ఆర్టికల్‌ 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించిన ఆర్టికల్‌ 356ను సవరించాల్సి ఉంది'' అని పేర్కొన్నారు.

రాజ‌కీయ పార్టీలు, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ ఏకాభిప్రాయం

జ‌మిలి ఎన్నిక‌ల‌కు ''అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని పొందడం. పాలనా వ్యవస్థలో ముఖ్యమైన సమాఖ్య నిర్మాణానికి సంబంధించి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయం కూడా పొందడం అత్యవసరం'' అని అని పేర్కొన్నారు. ''పెద్ద ఎత్తున అదనపు ఈవిఎంలు, వివిప్యాట్‌ యంత్రాలు అవసరం. అందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. అయితే ఆ ఈవిఎంలు, వివిప్యాట్‌ యంత్రాలు 15 ఏళ్ల కంటే ఎక్కువ పనిచేయవు. ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్ద ఎత్తున డబ్చు ఖర్చు చేయాలి. అంతా భారీ స్థాయిలో ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఈవిఎం, వివిప్యాట్‌ యంత్రాలను కేవలం మూడు, నాలుగు సార్లు మాత్రమే ఉపయోగించగలం. అదనంగా పోలింగ్‌ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం'' అని తెలిపారు. ''ఒకేసారి ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కేంద్ర సిబ్బంది, న్యాయ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పరిశీలన చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సహా సంబంధిత భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపింది. తదుపరి రోడ్‌ మ్యాప్‌ రూపకల్పనకై ప్రస్తుతం లా కమిషన్‌ పరిశీలనలో ఉంది'' అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఐదు రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల‌తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని 2018లో లా కమిషన్‌ అభిప్రాయపడింది.

జిమిలి ఎన్నిక‌లతో నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు త‌గ్గుతుందా?

ఏక‌కాల ఎన్నిక‌ల నిర్వ‌హించ‌డం వ‌ల్ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు ఆదా అవుతుందని, అభివృద్ధి దూసుకుపోతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది. అయితే ఈ రెండు వాద‌న‌ల్లో ప‌స‌లేదు. ఎందుంటే దేశంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఐదేళ్ల‌కు రూ.8 వేల కోట్లు ఖ‌ర్చు అవుతుంది. అందులో కాస్తా ఆదా అవ్వ‌టం ఖాయ‌మే. కానీ దేశంలో బ‌డా కార్పొరేట్ శ‌క్తుల కేంద్ర ప్ర‌భుత్వం దాదాపు రూ.12 ల‌క్ష‌ల కోట్లు రుణ‌మాఫీ చేసింది. దేశంలో బ్యాంకుల్లో దాదాపు ఎనిమిది ల‌క్ష‌ల కో్ట్లు మొండి బ‌కాయిలున్నాయి. ఈ మొత్తంతో వంద‌ల ఏళ్ల పాటు ఎన్నిక‌లు నిర్వ‌హించొచ్చు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం లెక్క‌ల ప్ర‌కార‌మే ఏక‌కాల (జ‌మిలి) ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ వ్య‌యం వేల కోట్లు అవుతుంద‌ని అంచ‌నా. అలాగే భారీ మొత్తం ఖ‌ర్చు చేసి కొనుగోలు చేసే ఈవిఎం, వివిప్యాట్ యంత్రాలు కేవ‌లం మూడు, నాలుగు ఎన్నిక‌ల‌కే ఉప‌యోగ ప‌డ‌తాయ‌ని, ప్ర‌తి 15 ఏళ్ల‌కు మార్చాల్సి వ‌స్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మ‌రి అలాంట‌ప్పుడు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ వ్యయం ఆదా అవుతుంద‌ని అన‌డంలో అర్థ‌మేముందీ?

ఆమోదం లభించడం సులభమేమీ కాదు

One nation one election committee : జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్‌ ఉభయ సభలు కనీసం 67 శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ర్టాల అసెంబ్లీలు ఆమోద ముద్రవేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్‌సభలో కనీసం 67 శాతం (362 ఎంపిలు) మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటువేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం (164 ఎంపిలు) ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్ర అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది.

ఇత‌ర దేశాల్లో జ‌మిలి ఎన్నిక‌లు

ప్ర‌పంచంలో కొన్ని దేశాలు ఆయా దేశాల ప‌రిస్థితుల నేప‌థ్యంలో జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నాయి. మెజార్టీ ప్ర‌జాస్వామ్య దేశాలు మాత్రం జ‌మిలికి దూరంగా ఉన్నాయి. పెద్ద పెద్ద ప్ర‌జాస్వామ్య దేశాలు జ‌మిలి ఎన్నిక‌ల‌ను తిర‌స్క‌రించాయి. ద‌క్షిణాఫ్రికా, స్వీడ‌న్‌, బెల్జియం దేశాల్లో జ‌మిలి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఆయితే ఆయా దేశాల‌ను భార‌త‌దేశంతో పోల్చ‌డం స‌రికాదు. ఇవి కోటి జ‌నాభా క‌లిగి ఉన్న దేశాలు. త‌మిళ‌నాడు జ‌నాభా ఎనిమిది కోట్లు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ జ‌నాభా 13 కోట్లు. అంతేకాదు ఇండియాలోని చాలా రాష్ట్రాల జ‌నాభాయంత కూడా లేని దేశాల‌తో పోల్చుకొని జ‌మిలి ఎన్నిక‌ల తీసుకురావ‌డం అర్థం లేనిది.

రాజ‌కీయ పార్టీలు-అభిప్రాయాలు

జ‌మిలి ఎన్నిక‌ల‌పై దేశంలోని జాతీయ‌, ప్రాంతీయ పార్టీలు అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశాయి. 2015 సెప్టెంబ‌ర్ 1 నుంచి 2018 ఆగ‌స్టు 31 వ‌ర‌కు ప‌ని చేసిన 21వ లా క‌మిష‌న్ చైర్మ‌న్ జ‌స్టిస్ బిఎస్ చౌహాన్ నేతృత్వంలో జ‌మిలి ఎన్నిక‌ల‌పై ఏడు జాతీయ‌, 59 ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలు కోరారు. అయితే అందులో కేవ‌లం 14 పార్టీలు మాత్ర‌మే న్యాయ క‌మిష‌న్‌ను క‌లిసి, త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించాయి. ఐదు పార్టీలు టిఆర్ఎస్ (బిఆర్ఎస్‌), శిరోమ‌ణి అకాలీ ద‌ళ్‌, అన్నాడిఎంకె, ఎస్‌పి, వైసిపి జ‌మిలి ఎన్నిక‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపాయి. ప‌ది పార్టీలు సిపిఎం, సిపిఐ, టిడిపి, డిఎంకె, జెడిఎస్‌, టిఎంసి, ఆప్‌, ఐయుఎంఎల్‌, బోడో పీపుల్స్ ఫ్రంట్‌, గోవా ఫార్వ‌ర్డ్ పార్టీ (ఎన్‌డిఎ భాగ‌స్వామ్య పార్టీ)లు జ‌మిలి ఎన్నిక‌ల‌ను వ్య‌తిరేకించాయి. 2015లో కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ పార్టీలు పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిటీ ముందు కూడా జ‌మిలి ఎన్నిక‌ల‌ను వ్య‌తిరేకించాయి.

– జె.జ‌గ‌దీశ్వ‌ర‌రావు, పీపుల్స్ ప‌ల్స్ రీసెర్చ్ సంస్థ‌

జె.జ‌గ‌దీశ్వ‌ర‌రావు

(గమనిక:- పైన ప్రచురించిన కథనంలోని విశ్లేషణ రచయిత అభిప్రాయాలు మాత్రమే. హెచ్​టీ తెలుగువి కావు)

తదుపరి వ్యాసం