One Nation- One Election : 'మంచిదే'- జమిలి ఎన్నికలకు ప్రశాంత్ కిశోర్ మద్దతు.. కానీ!
One Nation- One Election : జమిలి ఎన్నికల వ్యవహారంపై ఎట్టకేలకు స్పందించారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. మంచి ఉద్దేశాలతో అమలు చేస్తే.. దేశానికి ఈ జమిలి ఎన్నికలతో ప్రయోజనమే ఉంటుందని అన్నారు.
One Nation- One Election : 'ఒకే దేశం- ఒకే ఎన్నికల' వ్యవహారం ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియపై తన అభిప్రాయాలను వెల్లడించారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. దేశ ప్రయోజనాలకు జమిలి ఎన్నికలు దోహదపడాయని అన్నారు. కానీ దీనిని తీసుకురావడం వెనక ప్రభుత్వానికి మంచి ఉద్దేశం ఉంటేనే.. దేశానికి మంచి జరుగుతుందని వ్యాఖ్యానించారు.
"మంచి ఉద్దేశంతో చేస్తే.. ఒకే దేశం- ఒకే ఎన్నికలతో దేశానికి ప్రయోజనమే. కానీ ఏదీ హడావుడిగా జరిగిపోకూడదు. కనీసం 4-5ఏళ్లు సమయం తీసుకోవాలి. అప్పుడే దేశానికి మంచిది. 17-18ఏళ్ల క్రితం దేశంలో జమిలి ఎన్నికలే ఉండేవి. భారత్ లాంటి అతిపెద్ద దేశంలో.. ప్రతియేటా 25శాతం మంది ఓట్లు వేస్తూనే ఉంటారు. ప్రభుత్వాలను నడిపేవారు ఎన్నికల కోసం బిజీబిజీగా గడపాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల ప్రక్రియను 1-2సార్లకు పరిమితం చేస్తే మంచిది. ఖర్చులు తగ్గుతాయి. సమయం కూడా కలిసి వస్తుంది. కానీ రాత్రికి రాత్రే ఇదంతా జరిగిపోవాలి అనుకుంటే కష్టం. కేంద్రం బిల్లుని తీసుకొస్తున్నట్టుంది. తీసుకురానివ్వండి. మంచి ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే.. ఇది దేశానికి నిజంగా మంచి చేసే విషయమే," అని ఓ సమావేశంలో అభిప్రాయపడ్డారు ప్రశాంత్ కిశోర్.
Prashant Kishor on One Nation- One Election : ఈ నెల 18 నుంచి 5 రోజుల పాటు పార్లమెంట్ స్పెషల్ సెషన్ జరగనుంది. అజెండా గురించి కేంద్ర మోనంగా ఉంటూ వస్తోంది. అయితే ఒకే దేశం- ఒకే ఎన్నికల విషయంపైనే చర్చ జరుగుతుందని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు.. ఈ ఎన్నికల ప్రక్రియను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. జమిలి ఎన్నికలతో రాష్ట్రాలపై దాడి జరుగుతుందని మండిపడుతున్నారు. ఈ తరుణంలో.. కేంద్రం ఆలోచనలకు ప్రశాంత్ కిశోర్ మద్దతు పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశంలో 1967 వరకు జిమిలి ఎన్నికలే జరిగేవి. కాకపోతే 1969లో కొన్ని అసెంబ్లీలు రద్దు అయ్యాయి. 1970లో లోక్‌సభ సైతం రద్దు అయ్యింది. అప్పటి నుంచి ఎన్నికల షెడ్యూల్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
బీజేపీ మాత్రం మొదటి నుంచి 'వన్ నేషన్- వన్ ఎలక్షన్'కు మద్దతిస్తూనే వచ్చింది. దేశంలో దీనిని అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం.. ఈ ప్రక్రియకు మద్దతిస్తూ అనేకమార్లు వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం