Jamili Elections - Telangana : జమిలి ఖరారైతే ఎలా...? ఒక్కో పార్టీది ఒక్కో లెక్క!
03 September 2023, 11:08 IST
- One Nation One Election : జమిలీ ఎన్నికల దేశంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఒక వేళ జమిలి ఎన్నికలంటూ ఖరారైతే ఎట్టా అన్న బెంగ తెలంగాణలోని ప్రధాన రాజకీయపార్టీలకు పట్టుకున్నట్లు తెలుస్తోంది.
జమిలీ ఎన్నికలు
One Nation One Election : కేంద్రం లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ‘ వన్ నేషన్.. వన్ ఎలక్షన్ ’ నినాదంతో జమిలి ఎన్నికలకు వడివడిగా అడుగులు వేస్తోంది. సాధ్యాసాధ్యాలపై అధ్యయానికి ఎనమిది మంది సభ్యలుగా మాజీ రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలూ ముందస్తు ఎన్నికల కరసరత్తులో భాగంగానే అన్న అభిప్రాయమూ బలంగా వ్యక్తమవుతోంది.
ఒక వేళ జమిలి ఎన్నికలంటూ ఖరారైతే ఎలా అన్న బెంగ ప్రధాన రాజకీయ పక్షాలను పట్టి పీడిస్తోందని ఆయా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని విశ్లేషించినా పార్టీలకు ఉన్న ఇబ్బందులు ఏంటో ఇట్టే అర్ధమవుతుంది. రానున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. వామపక్షాలు కాంగ్రెస్ తో జతకట్టడడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర స్థాయిలో ఏర్పాటయిన ‘ఇండియా’ కూటమిలో వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐ కాంగ్రెస్ తో కూడి ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ఎన్నికల్లోనూ అవి కలిసి పోటీకి వెళ్లే అవకాశం ఉంది. మరో వైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జంట నగరాల్లో ప్రభావం చూపే ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ కు మిత్రపక్షంగానే కొనసాగుతోంది. బహుజన నినాదంతో ముందుకు వెళుతున్న బీఎస్పీ ఈ సారి సత్తా చాటాలని చూస్తోంది. ఇక్కడి వరకు ఆయా పార్టీలూ తెలంగాణ ఎన్నికలకు అస్త్ర శస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ఇపుడు జమిలి ఎన్నికల పేర లోక్ సభకూ అభ్యర్థులను నిలబెట్టాల్సి రావడం ఒక విధంగా అన్ని పార్టీలకు కత్తిమీది సామువంటిదే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కారణం సింపుల్, అందరి ఆశా ఎమ్మెల్యే కావాలనే... అసెంబ్లీకి వెళ్లాలనే. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న నాయకులు సైతం అసెంబ్లీ ఎన్నికల కోసమే కాచుక్కూర్చున్నారు. తమ లోక్ సభ నియోజకవర్గాలను వదిలేసి.. ఎంపీలుగా గెలిచే వరకు తాము ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం కార్యక్రమాలు చేసుకుంటున్నారు.
ఒక్కో పార్టీది ఒక్కో లెక్క
వాస్తవానికి తెలంగాణలో ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో లెక్క ఉంది. గడిచిన రెండు పర్యాయాలు 2014, 2018 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పై ఎంత లేదన్నా బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందని, దానికి క్యాష్ చేసుకుంటే ఈ సారి తామే అధికారంలోకి రావొచ్చన్న అంచనాలో, ధీమాలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. ఈ సారి రాష్ట్రంలో అధికారం తమదే అన్న ఆత్మవిశ్వాసంతో ఉన్న ఈ పార్టీలో అంతా అసెంబ్లీ ఎన్నికలపైనే ఆశలు పెట్టుకున్నారు. మరో వైపు ముచ్చటగా మూడో సారి కూడా అధికారంలోకి రావాలని శ్రమిస్తున్న బీఆర్ఎస్ ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇపుడు లోక్ సభ ఎన్నికలు కూడా వచ్చిపడితే తమకు నష్టం జరుగుతుందన్న ఆందోళనలో బీఆర్ఎస్ నాయకత్వం ఉందంటున్నారు. ఈ తరుణంలో అభ్యర్ధుల సర్దుబాటు ఎలా అన్న ఆలోచనల్లో పడిపోయిందంటున్నారు.
కాంగ్రెస్...
కాంగ్రెస్ పూర్తి స్థాయిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేస్తోంది. కర్ణాటక ఫార్ములాను ఇక్కడా అమలు చేసి విజయఢంకా మోగించాలన్నది ఆ పార్టీ వ్యూహం. ఈ సారి అధికారం తమదే అన్న నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ లో చివరకు సిట్టింగ్ ఎంపీలు సైతం ఎమ్మెల్యేలు కావాలనే భావిస్తున్నారు. టీపీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్దమవుతున్నారు. గతంలో నిజామాబాద్ నించి ప్రాతినిధ్యవం వహించిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం కోసం ఎల్.బి.నగర్ అసెంబ్లీ టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉంటానని భావిస్తున్న సీనియర్ నేత కుందూరు జానారెడ్డి నాగార్జున సాగర్ కోసం దరఖాస్తు చేసుకోకున్నా ఆయన మనసంతా అక్కడే ఉంది. అయితే, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ కు ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు ఉన్నా ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఒక విధంగా చెప్పుకోదగిన అభ్యర్థులే లేరు.
బీఆర్ఎస్...
బీఆర్ఎస్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్న సిట్టింగ్ ఎంపీలు తిరిగి అభ్యర్థులు అవుతారనుకున్నా, మిగిలిన స్థానాల్లో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారే తిరిగి అభ్యర్థులుగా బరిలోకి దిగుతారని అంచనా వేసినా.. ఉమ్మడి నల్లగొండ విషయంలో మాత్రం ప్రత్యేక పరిస్థితి ఉంది. నల్లగొండలో ఓడిపోయిన వేంరెడ్డి నర్సింహారెడ్డి ఇప్పటి దాకా పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు. భువనగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దుబ్బాక అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించారు. నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో ఓటమిపాలైన కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యురాలిగా ఉన్నారు. కరీంనగర్ ఎంపీగా ఓటమిపాలైన బి.వినోద్ కుమార్ రాష్ట్ర ప్రణాళిక మండలి చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఒకే సారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలంటే అభ్యర్థుల ఎంపిక, కూర్పు బీఆర్ఎస్ కు కూడా కష్టమే కానుందని వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీ…..
12 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉమ్మడి నల్లగొండలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికే బీజేపీ సరైన అభ్యర్థుల కోసం నానా తంటాలు పడుతోంది. ఇలాంటి తరుణంలో లోక్ సభ నియోజకవర్గానికి అభ్యర్థులు కావాలంటే కష్టమేనని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అంబర్ పేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. సుదీర్ఘ కాలం సికింద్రాబాద్ నుంచి పార్లమెంటు రాజకీయాలు చేసిన బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నారు. చాలా అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల కొరతను ఎదుర్కొంటోందని చెబుతున్న బీజేపీకి అదనంగా లోక్ సభ కోసం అభ్యర్థులను గాలించడం తలకు మించిన భారమే కానుంది. ఇతరత్రా పార్టీలను మినహాయిస్తే.. ప్రధాన రాజకీయ పక్షాలకు జమిలి ఎన్నికలు విషమ పరీక్షే కానున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రిపోర్టింగ్: క్రాంతీపద్మ, నల్లగొండ