IRCTC Tickets Booking : వేరే ఇంటిపేరుతో ఉన్నవారికి మీ ఐఆర్‌సీటీసీ ఐడీతో టికెట్స్ బుక్ చేయవచ్చా?
26 June 2024, 16:04 IST
- IRCTC Tickets Booking : రెండు మూడు రోజులుగా ఐఆర్‌సీటీసీకి సంబంధించిన ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ ఖండించింది. ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో వేరే ఇంటి పేరుతో ఉన్నవారికి టికెట్స్ బుకింగ్స్ గురించి ఈ విషయం.
ఐఆర్‌సీటీసీ టికెట్స్ బుకింగ్‌పై క్లారిటీ
IRCTC అకౌంట్ ఉన్నవారు వేరే ఇంటిపేరు ఉన్న ఇతర వ్యక్తుల కోసం ఇ-టికెట్లను బుక్ చేసుకోలేరనే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ పుకారుపై భారతీయ రైల్వే స్పందించింది. ఆ వార్త తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొంది. అసలు ఐఆర్‌సీటీసీ అలాంటి రూల్స్ ఏమీ పెట్టలేదని పేర్కొంది.
ఒక ప్రకటనలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ అపోహపై స్పందించారు. IRCTC ఖాతా ఉన్న ఎవరైనా వారి ఇంటిపేరుతో సంబంధం లేకుండా ఇతరుల కోసం ఇ-టికెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందులో ఫ్రెండ్స్, ఫ్యామిలీ.., ఇతరులకు సంబంధించిన టికెస్ట్ బుక్ చేసుకోవచ్చు. అయితే మీకు తెలిసినవారివి మాత్రమే బుక్ చేయాలి.
'వేర్వేరు ఇంటిపేర్లతో ఉన్నవారి ఇ-టికెట్ల బుకింగ్‌పై పరిమితి గురించి సోషల్ మీడియాలో సర్క్యులేషన్‌లో ఉన్న వార్తలు అబద్ధం, తప్పుదారి పట్టించేవి. ఐఆర్‌సీటీసీ ఖాతాదారులు తమ ఐడీ నుండి స్నేహితుల కోసం, ఇతర ఇంటి పేర్లు ఉన్నవారి కోసం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.' అని ఐఆర్‌సీటీసీ క్లారిటీ ఇచ్చింది.
రైల్వే బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్ చేయబడతాయని, ఈ మార్గదర్శకాలకు సంబంధించిన మొత్తం సమాచారం పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. భారతీయ రైల్వేల ప్రకారం IRCTC ఖాతా ఉన్న ఎవరైనా వారి ఇంటిపేర్లు, స్థానం మొదలైన వాటితో సంబంధం లేకుండా స్నేహితులు, కుటుంబం, బంధువులు మొదలైన వారి కోసం టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే, IRCTC ఖాతాను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించలేరు.
వ్యక్తిగత IRCTC ఖాతాను వాణిజ్య టిక్కెట్ల ప్రయోజనాల కోసం ఉపయోగించలేమని, ఇది రైల్వే చట్టం, 1989 ప్రకారం శిక్షార్హమైన నేరమని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై క్లారిటీ లేకుండా చాలా మంది ఇతర ఇంటి పేర్లు ఉన్నవారి టికెట్స్ బుక్ చేయకూడదని వార్తలను వైరల్ చేశారు. దీంతో ఈ విషయంపై భారతీయ రైల్వే స్పందించింది.