Iran President Raisi death : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి
20 May 2024, 15:16 IST
Iranian President Raisi death : ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి చెందారు. హెలికాప్టర్ శకలాలు లభ్యమైన తర్వాత.. అధ్యక్షుడు మృతి చెందినట్టు ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది.
ఇరాన్ అధ్యక్షుడు రైసీ
Raisi Iran helicopter : ఇరాన్ దేశ 8వ అధ్యక్షుడు, 63ఏళ్ల ఇబ్రహీం రైసీ.. ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు.. ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సైన్ ఆమిర్- అబ్దల్లాహియన్, పలువురు అధికారులు వీరమణం పొందినట్టు.. ఇరాన్ స్టేట్ మీడియా సోమవారం కథనం ప్రచురించింది.
ఇదీ జరిగింది..
రెండు దేశాల మధ్య సంయుక్త ప్రాజెక్టు అయిన కిజ్-ఖలాసి ఆనకట్టను ప్రారంభించడానికి రైసీ.. ఆదివారం అజర్ బైజాన్ సరిహద్దుకు వెళ్లారు. అక్కడి నుంచి.. బెల్ 212 హెలికాప్టర్లో ఆయన తిరుగు పయణమయ్యారు. కానీ.. లోయలు, పర్వత ప్రాంతాలు ఉండే జోఫ్లా నగరంలో ఆ హెలికాప్టర్ 'హార్డ్ ల్యాండింగ్' అయ్యింది.
తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్‌లోని శిథిలాలను చేరుకోవడానికి సహాయక బృందాలు రాత్రంతా మంచు తుఫాను, క్లిష్టమైన భూభాగాలతో పోరాడాయి. ఈ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైంది. దురదృష్టవశాత్తు, ప్రయాణీకులందరూ మరణించినట్లు మీడియా చెప్పింది.
ఎవరు ఈ ఇబ్రహీం రైసీ..?
Iran President Raisi death : 63 ఏళ్ల రైసీ 2021లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధికారం చేపట్టినప్పటి నుంచి నైతిక చట్టాలను కఠినతరం చేయాలని, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేయాలని, ప్రపంచ దేశాలతో అణు చర్చల్లో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
అయితే.. ఇరాన్లో అధ్యక్షుడి కన్నా సుప్రీమ్ లీడర్‌కే పవర్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత సుప్రీమ్ లీడర్ అయతొల్లాహ్ అలీ ఖమేనీ తర్వాత.. ఆ స్థానాన్ని రైసీ భర్తీ చేయడం ఖాయమని అక్కడి ప్రజలు భావించారు.
రైసీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు.. ఇరాన్లో అనేక ఆర్థిక సంక్షోభాలు కనిపించాయి. ప్రజల జీవితాలు భారమయ్యాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ఇరాన్ కరెన్సీ క్రాష్ అయ్యింది. ఇరాన్ పెద్దల ప్రవర్తన కారణంగా.. అప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించిది. ఇవన్నీ.. అక్కడి ప్రజలను చాలా ఇబ్బంది పెట్టాయి.
'బుచర్ ఆఫ్ టెహ్రాన్..'
Ebrahim Raisi latest news : రాజకీయ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే వ్యక్తిగా, నిరసనలపై ఉక్కుపాదం మోపే వ్యక్తిగా ఇరాన్ అధ్యక్షుడు రైసీకి పేరుంది. అంతేకాదు.. ఈయనకు 'బుచర్ ఆఫ్ టెహ్రాన్'గా కూడా పేరుంది.
1980వ దశకంలో ఇరాన్లో చెలరేగిన హింస అనంతర పరిణామాల్లో అరెస్ట్ అయిన వేలాది మంది రాజకీయ ఖైదీలను ఉరి తీయాలని షాకింగ్ ఆదేశాలిచ్చిన నలుగురు న్యాయమూర్తుల్లో ఈ రైసీ ఒకరు. ఇదే విషయంపై.. 2019లో యూఎస్ ట్రెజరీ విభాగం రైసీపై ఆంక్షలు కూడా విధించింది.
రైసీ ‘వీరమరణం’ పొందారని ఇరాన్ స్టేట్ మీడియా చెబుతున్నా.. ఆయన మృతి చెందిన వార్త విని బాధపడేవారు చాలా తక్కువ మంది ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధాని మోదీ స్పందన..
Ebrahim Raisi death : ఇరాన్ అధ్యక్షుడు మృతి పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
“ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డా. సయ్యెద్ ఇబ్రహీమ్ రైసీ మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. చాలా బాధ కలిగింది. భారత్- ఇరాన్ ద్వైపాక్షిక మైత్రి కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుంది,” అని మోదీ.. తన ట్వీట్లో పేర్కొన్నారు.