Infosys | నిమిషాల్లో రూ. 40వేల కోట్ల నష్టం.. ఈ స్టాక్ పరిస్థితేంటి?
18 April 2022, 15:49 IST
- సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఇన్ఫోసిస్ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. ఒకానొక దశలో నిమిషాల వ్యవధిలో రూ. 40వేల కోట్ల నష్టం వాటిల్లింది. మరి ఇప్పుడు ఈ స్టాక్ పరిస్థితేంటి? ఇక్కడ కొనుగోలు చేయవచ్చా?
ఇన్ఫోసిస్
Infosys share price | ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో 7శాతం మేర పతనమయ్యాయి. ఉదయం మార్కెట్లు తెరుచుకున్న కొద్ది నిమిషాల్లోనే.. పెట్టుబడిదారులు రూ. 40వేల కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. మొత్తం ఐటీ సెక్టార్ స్టాక్స్‌పై ఈ ప్రభావం పడింది. ఐటీ సూచీ ఏకంగా 4శాతం మేర నష్టపోయింది.
త్రైమాసిక ఫలితాలతో డీలా..
2022 ఆర్థిక ఏడాది 4వ త్రైమాసికంలో ఇన్ఫోసిస్.. అంచనాలకు తగ్గట్టు ఫలితాలు డెలివరీ చేయలేకపోవడమే ఈస్థాయి పతనానికి కారణం. దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సర్వీసు సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫోసిస్.. గత త్రైమాసికంతో పోల్చుకుంటే.. నికర లాభం 12శాతం పెరిగింది. రెవెన్యూ 23శాతం పెరిగింది. ఇవి అంచనాల కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో సంస్థ మార్జిన్లపై తీవ్ర ప్రభావం పడింది. థర్డ్ పార్టీ వ్యయాలు విపరీతంగా పెరిగిపోవడం ఇందుకు ఓ కారణం.
గత ట్రేడింగ్ సెషన్లో 1,749 వద్ద ముగిసిన ఇన్ఫీ.. సోమవారం ఏకంగా 1,605 వద్ద తెరుచుకుంది. అప్పటికే మదుపర్లు వేల కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. ఇక రోజంతా ఈ సంస్థ షేరు భారీ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యింది. చివరికి 1,622 వద్ద స్థిరపడింది. మొత్తం మీద 126పాయింట్ల నష్టాన్ని(7.22శాతం) ఇన్ఫోసిస్ మూటగట్టుకుంది.
కాగా.. ఇన్ఫోసిస్ అనేది చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. పైగా పరిస్థితులపై సంస్థ కీలక వ్యాఖ్యలు సైతం చేసింది. పెద్ద పెద్ద డీల్స్ వస్తున్నాయని, వ్యాపారానికి నష్టం లేదని పేర్కొంది.
అందువల్ల.. తాజా పరిస్థితులు స్వల్పకాలానికే అని, భవిష్యత్తులో స్టాక్ మళ్లీ పుంజుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని రేటింగ్ సంస్థలు.. ఈ స్టాక్‌కు బై రేటింగ్ ఇస్తూ.. 12నెలల కాలానికి రూ. 2,426 టార్గెట్‌ని కూడా ఇస్తున్నాయి.
మరికొన్ని రేటింగ్ సంస్థలు మాత్రం.. ఇన్ఫోసిస్ షేరు టార్గెట్లను భారీగా తగ్గిస్తున్నాయి.
గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన వార్త మాత్రమే. ఎలాంటి పెట్టుబడులైనా పెట్టే ముందు.. మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.
టాపిక్