రూ. 69 స్టాక్‌లో వాటా పెంచుకున్న బిగ్ బుల్.. మీరు కొనుగోలు చేయాలా?
15 April 2022, 19:31 IST
- రాకేష్ ఝున్‌ఝున్‌వాలా.. తన సతీమణి రేఖ పోర్ట్‌ఫోలియోలోని ఎన్సీసీలో వాటా పెంచుకున్నారు. ప్రస్తుతం ఆ స్టాక్ రూ. 69 వద్ద ట్రేడ్ అవుతోంది.
రూ. 69 స్టాక్‌లో వాటా పెంచుకున్న బిగ్ బుల్
బిగ్ బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఒక స్టాక్‌లో పెట్టుబడి పెడుతున్నా, ఉపసంహరించుకుంటున్నా.. లేదా వాటాను పెంచుకుంటున్నా వార్తే. ఆయన్ని అనుసరించి స్టాక్ మార్కెట్లో లాభాలు పొందాలని చాలా మంది చూస్తూ ఉంటారు. అంతేకాకుండా.. ఆయన పెట్టుబడులు పెట్టే కంపెనీలపై అధ్యయనం చేస్తూ ఉంటారు. తాజాగా.. ఓ కంపెనీలో ఆయన వాటా పెంచుకున్నారు. అది కూడా రూ. 69 స్టాక్‌లో!
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. తన పేరు మీదే కాకుండా.. తన సతీమణి రేఖ పేరు మీద కూడా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. కాగా.. రేఖ పోర్ట్‌ఫోలియోలోని నిర్మాణం- ఇంజినీరింగ్ కంపెనీ అయిన ఎన్సీసీలో.. క్యూ4లో వాటా పెంచుకున్నారు బిగ్ బుల్.
ఎన్సీసీలో వీరికి 2015 డిసెంబర్ నుంచి పెట్టుబడులు ఉన్నాయి. కాగా.. ప్రస్తుతం రేఖ వాటాను 0.72శాతం మేర పెంచారు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా. ఇది ఆ సంస్థ షేర్‌హోల్డింగ్ డేటాలో దర్శనమిచ్చింది. ఫలితంగా.. 2022 మార్చ్ నాటికి సంస్థలో రేఖ వాటా.. 1.6కోట్ల ఈక్విటీ షేర్లకు చేరింది(2.62శాతం). 2021 డిసెంబర్ నాటికి అది 1.90శాతంగా మాత్రమే ఉండేది.
మరోవైపు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు ఎన్సీసీలో ఉన్న వాటా(10.94శాతం)లో ఎలాంటి మార్పులు లేవు.
బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి ఎన్సీసీ షేరు రూ. 69.60కు పడింది. సంస్థ మార్కెట్ వాల్యుయేషన్ రూ. 4,244.53కోట్లుగా ఉంది. ఏడాదిగా స్టాక్‌లో కరెక్షన్ కనిపిస్తున్నా.. సంస్థలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా వాటాను పెంచుకోవడం విశేషం.
కాగా.. మార్కెట్లో ప్రస్తుతం త్రైమాసిక ఫలితాల సీజన్ నడుస్తోంది. అందువల్ల ఎన్సీసీ షేర్ల కదలికలకు కూడా ఫలితాలపైనే ఆధారపడి ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్సీసీ.. మంచి ఫలితాలనే డెలివరీ చేస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో అప్పులను కూడా సంస్థ తగ్గించుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రాసిన వార్త మాత్రమే. ఎలాంటి పెట్టుబడులైనా పెట్టే ముందు.. మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.
టాపిక్