Semeru volcano : ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. సునామీ వస్తుందా?
04 December 2022, 11:50 IST
Semeru volcano erupts in Indonesia : ఇండోనేషియాలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిపర్వతం బద్ధలైంది. ఫలితంగా ఆ ప్రాంతం అంతా బూడిదతో నిండిపోయింది.
బద్ధలైన సెమెరు అగ్నిపర్వతం
Semeru volcano erupts in Indonesia : ఇండోనేషియా జావా ద్వీపంలోని సెమెరు అగ్నిపర్వతం బద్ధలైంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో.. 1.5కి.మీల దూరం వరకు గాలిలో బూడిద వ్యాపించింది. సెమెరు అగ్నిపర్వతం బద్ధలవ్వడంతో అప్రమత్తమైన అధికారులు.. ఆ ప్రాంతం నుంచి ప్రజలు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
సెమెరు అగ్నిపర్వతం బద్ధలైన ప్రాంతం నుంచి 5కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి కార్యకలాపాలు సాగించవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఇండోనేషియా విపత్తు నిర్వహణ బృందం. ఆదివారం తెల్లవారుజామున 2:46 గంటల సమయంలో అగ్నిపర్వతం బద్ధలైందని తెలుస్తోంది. ఫలితంగా ఆ ప్రాంతాన్ని దట్టమైన బూడిద కమ్మేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
మరోవైపు.. స్థానిక ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు ఇండోనేషియా అధికారులు. తూర్పు జావా రాష్ట్రంలోని లుమజంగ్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను మొదలుపెట్టారు. తొలుత అగ్నిపర్వతం తీవ్రతను లెవల్-3గా గుర్తించిన అధికారులు.. కొన్ని గంటలకే లెవల్-4కు మార్చారు. లెవల్ 4ను అత్యంత తీవ్రమైనదిగా భావిస్తారు.
Indonesia Semeru volcano : ఇండోనేషియాలో మొత్తం మీద 142 ఆగ్నిపర్వతాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా.. అగ్నిపర్వతాలకు అత్యంత సమీపంలో నివాసముంటున్న ప్రజలు ఇండోనేషియాలోనే ఉన్నారు.
ఈ సెమెరు అగ్నిపర్వతం ఎత్తు 3,676 మీటర్లు. అగ్నిపర్వతం బద్ధలుకావడంతో సమీప ప్రాంతాలన్నీ లావాతో నిండిపోయాయి.
చివరిసారిగా.. గతేడాది డిసెంబర్లో ఈ సెమెరు అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ ఘటనలో 51మంది మరణించారు. వందలాది మందికి గాయాలయ్యాయి. అనేకమందికి చర్మం కాలిపోయింది. సమీపంలోని అనేక గ్రామాలు మట్టిలో కూరుకుపోయాయి. ఆ సమయంలో.. సుమారు 10వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు అధికారు.
గత 200ఏళ్లల్లో.. ఈ సెమెరు అగ్నపర్వతం ఎన్నోసార్లు బద్ధలైంది. ఇండోనేషియాలో 129 అగ్నిపర్వతాలు నిత్యం యాక్టివ్గానే ఉంటాయి. అయినప్పటికీ.. వేలాది మంది ప్రజలు అక్కడే జీవితాన్ని సాగిస్తూ ఉంటారు.
ఇక్కడ భూకంపాలు కూడా తరచూ సంభవిస్తూ ఉంటాయి. ఈ పరిణామాలతో ఇక్కడి ప్రజలు నిత్యం బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉంటారు.
సునామీ వస్తుందా?
ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్ధలైన ఘటనను జపాన్ వాతావరణశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సునామీ వచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది.
Semeru volcano eruption : అగ్నిపర్వతం వల్ల సునామీ వస్తే.. ఘటనాస్థలం నుంచి జపాన్ను అది తాకడానికి కేవలం 3 గంటల కన్నా తక్కువ సమయమే పడుతుందని జపాన్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
సునామీ వచ్చే ప్రమాదంపై ఇండోనేషియా అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.