48 గంటల వ్యవధిలో 1,100 భూకంపాలు.. అసలు ఏం జరిగింది?
ఒక్క భూకంపానికే ప్రజలు అల్లాడిపోతుంటారు. అలాంటిది 48 గంటల వ్యవధిలో భూమి 1,100సార్లు కంపిస్తే?
1000 earthquakes | ఒక్కసారి భూమి కంపిస్తేనే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటిది 48గంటల వ్యవధిలో 1,100 భూకంపాలు చోటుచేసుకుంటే? పోర్చుగల్‌లో ఇదే జరిగింది. పరిస్థితిని అర్థం చేసుకునేందుకు అక్కడి అధికారులు అత్యవసర ప్రణాళికలు రచించారు. అయితే పెద్దగా ఆందోళనపడాల్సిన అవసరం ఏం లేదు!
మధ్య అట్లాంటిక్‌లో అగ్నిపర్వతాలతో కూడిన సావో జార్జ్ ద్వీపంలో రిక్టార్ స్కేలుపై 1.9-3.3 తీవ్రతతో కూడిన భూకంపాలు నమోదైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. శనివారం- సోమవారం మధ్యలో భూమి 1,100సార్లు కంపించినట్టు పేర్కొన్నారు. 1808లో బద్ధలైన మనడాస్ అగ్నిపర్వతం చుట్టూ భూకంపాలు వచ్చినట్టు, పెద్దగా ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
సావో జార్జ్‌లో సుమారు 8,400మంది నివాసముంటున్నారు. ఫైయల్, పికో వంటి పర్యాటక ప్రదేశాలు కూడా సమీపంలోనే ఉంటాయి.
భూకంపాల నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టారు అధికారులు. అత్యవసర ప్రణాళికలను అమలు చేసే విధంగా సావో జార్జ్‌లోని వేలస్ మున్సిపాలిటీ మేయర్ చర్యలు చేపట్టారు. సావో జార్జ్‌లో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం వేలస్.
Sao Jorge earthquake | అయితే ఈస్థాయిలో భూకంపాలు నమోదవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం.. ఘటన జరిగిన ప్రాంతంలో మరిన్ని సీస్మిక్ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి మట్టిలోని వాయువులపై అధ్యయనం చేసి.. ఈ భూకంపాలు.. అగ్నిపర్వతాలు బద్ధలవ్వడానికి సంకేతాలా? అన్నది తెలుసుకోనున్నారు.
ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలని ప్రాంతీయ పౌరుల సంరక్షణ ప్రాధికార సంస్థ పిలుపునిచ్చింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 1,100 భూకంపాల్లో.. 63 మాత్రమే ప్రజలపై ప్రభావం చూపించాయని పేర్కొంది. పరిస్థితికి తగట్టుగ్గా వ్యవహరించాలని స్పష్టం చేసింది.
సంబంధిత కథనం