Monkeypox death : దేశంలో తొలి మంకీపాక్స్ మరణం.. కేరళలో!
31 July 2022, 21:41 IST
- Monkeypox death : మంకీపాక్స్ లక్షణాలు ఉన్న ఓ వ్యక్తి.. కేరళలోని త్రిస్సూర్‌లో మరణించాడు. ఫలితంగా దేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది.
దేశంలో తొలి మంకీపాక్స్ మరణం.. కేరళలో!
Monkeypox death : దేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది. ఇతర దేశంలో మంకీపాక్స్ వైరస్‌కు పాజిటివ్‌గా తేలిన వ్యక్తి.. కేరళలోని త్రిసూర్‌లో శనివారం మరణించాడు. ఫలితంగా ఆఫ్రికా బయట మంకీపాక్స్‌కు ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై స్పందించిన కేరళ ఆరోగ్యమంత్రి వీనా జార్జ్.. "మంకీపాక్స్ లక్షణాలతో మరణించిన వ్యక్తి వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాము. విదేశాల్లో అతనికి పాజిటివ్ అని తేలింది. చికిత్స కోసం కేరళ త్రిస్సూర్‌కు వచ్చారు," అని వివరించారు.
చికిత్స పొందడంలో ఆలస్యమైందా? అన్న కోణంలో విచారణ చేపడతామని వినా జార్జ్ వెల్లడించారు.
దేశంలో ఇప్పటివరకు 4 మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కాగా.. దేశవ్యాప్తంగా అనేకచోట్ల.. మంకీపాక్స్ లక్షణాలు ఉన్న అనుమానితుల వార్తలు బయటకొస్తున్నాయి.
తాజా ఘటనతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. మంకీపాక్స్ తీవ్రత చాలా తక్కువ అని అంటున్నారు.
మంకీపాక్స్- చికెన్ పాక్స్ మధ్య తేడా ఏంటి?
వైద్య నిపుణుల ప్రకారం.. మంకీపాక్స్ అనేది జంతువుల నుంచి మనుషలకు వ్యాపించింది. ఈ లక్షణాలు స్మాల్ పాక్స్‌ని కూడా పోలి ఉన్నాయి. కానీ దానితో పోల్చుకుంటే మంకీపాక్స్ తీవ్రత చాలా తక్కువ.
Monkeypox symptoms in Telugu : మంకీపాక్స్ అనేది ముందు జ్వరంతో మొదలవుతుంది. ఆ తర్వాత.. తలనొప్పి, గొంతునొప్పి, దగ్గు, అస్వస్థత కూడా వస్తాయి. శరీరంలో వాపులు కూడా గుర్తించవచ్చు. చర్మం మీద దద్దుర్లు ఏర్పడే నాలుగు రోజుల ముందు ఈ లక్షణాలు ఉంటాయి. చేతుల నుంచి కళ్లకు ఆ తర్వాత శరీరానికి వ్యాపిస్తాయి.
"చికెన్ పాక్స్‌తో పోల్చుకుంటే.. మంకీపాక్స్‌లో దద్దుర్లు చాలా పెద్దగా ఉంటాయి. మంకీపాక్సలో తొలుత దద్దుర్లు చేతులు, అరికాళ్లల్లో కనిపిస్తాయి. చికెన్ పాక్స్ వల్ల కలిగే దద్దుర్లు 7-8 రోజుల్లో పోతాయి. కానీ మంకీపాక్స్‌లో అలా కాదు. చికెన్ పాక్స్‌లో దద్దుర్ల దురదపెడతాయి. కానీ మంకీపాక్స్‌లో దద్దుర్లు దురద పెట్టవు," అని ఫార్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెదిన డా. సతీష్ కౌల్ వెల్లడించారు.
చికెన్ పాక్స్‌తో పోల్చుకుంటే మంకీపాక్స్‌లో వచ్చే జ్వరం.. ఎక్కువ రోజులు ఉంటుందని కౌల్ వివరించారు.
చికెన్ పాక్స్‌తో పోల్చుకుంటే.. మంకీపాక్స్‌తో మనిషిలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.
టాపిక్