Jack Dorsey : 'ట్విట్టర్‌ను మూసేస్తామని బెదిరించారు'- భారత ప్రజాస్వామ్యంపై డోర్సే విమర్శలు
13 June 2023, 9:06 IST
Jack Dorsey on Indian government : భారత ప్రభుత్వం, దేశ ప్రజాస్వామ్యంపై విమర్శలు చేశారు ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే. రైతు నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం తమను ఒత్తిడికి గురి చేసిందని ఆరోపించారు.
'ట్విట్టర్‌ను మూసేస్తామని బెదిరించారు'- భారత ప్రజాస్వామ్యంపై డోర్సె విమర్శలు
Jack Dorsey on Indian government : భారత దేశంలో ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే. రైతు నిరసనల నేపథ్యంలో.. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న అకౌంట్లను బ్లాక్ చేయాలని ట్విట్టర్‌కు అనేక మార్లు అభ్యర్థనలు అందినట్టు వివరించారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం ట్విట్టర్‌ను ఒత్తిడికి గురిచేసినట్టు, అవసరమైతే సామాజిక మాధ్యమాన్ని నిషేధిస్తామని కూడా బెదిరించినట్టు పేర్కొన్నారు.
బ్రేకింగ్ పాయింట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌కు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు డోర్సే. ఈ నేపథ్యంలో ఇండియాలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు.
"రైతుల నిరసనలపై వస్తున్న సానుకూల స్పందనలను ట్విట్టర్ నుంచి తొలగించాలని కేంద్రం మాకు చెప్పింది. లేకపోతే ఇండియాలో ట్విట్టర్‌ను మూసేస్తామని హెచ్చరించింది. మా ఉద్యోగుల ఇళ్లపై రైడ్లు నిర్వహిస్తామని బెదిరించింది. రైడ్లు చేసింది కూడా! ఇది ఇండియా.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం!," అని వ్యాఖ్యానించారు ట్విట్టర్ కో ఫౌండర్.
2020లో మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టింది కేంద్రం. దీనికి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. లక్షలాది మంది రైతులు ఉద్యమించారు. 2021 నవంబర్ వరకు ఆందోళనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో రైతులకు సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. చివరికి దిగొచ్చిన ప్రభుత్వం.. రైతు చట్టాలను ఉపసంహరించుకుంది.
Jack Dorsey India democracy : జాక్ డోర్సే మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విపక్షాలు డోర్సే ఇంటర్వ్యూను ట్యాగ్ చేస్తూ.. పోస్టులు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నాయి.
డోర్సే తాజా వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. ఆయన చెప్పినవి తప్పులని పేర్కొంది.
“డోర్సే చెప్పినవి పచ్చి అబద్ధాలు. ఇంకా చెప్పాలంటే.. ట్విట్టర్ చాలా సార్లు భారత చట్టాలను ఉల్లంఘించింది. 2020- 2022 మధ్యలో ఇలా చేసింది. ఆ తర్వాతే ట్విట్టర్ చట్టలను పాటించడం మొదలుపెట్టింది. ట్విట్టర్లో ఎవరు జైలుకు వెళ్లలేదు. ట్విట్టర్‌ను మూసివేయలేదు.” అని కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్‌శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.