కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని ఆపండి.. హిందువుల రక్షణ కోసం అమెరికాలో భారీ నిరసన
25 November 2024, 15:16 IST
- Canada Issue : కెనడాలోని హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ అమెరికాలోని భారత సంతతి ప్రజలు ర్యాలీ నిర్వహించారు. సిలికాన్ వ్యాలీలోని భారతీయులు.. కెనడా, బంగ్లాదేశ్‌లలో హిందువులకు సంఘీభావం తెలిపారు.
అమెరికాలో నిరసన
కెనడా, బంగ్లాదేశ్‌లలో హిందువులపై జరుగుతున్న హింసకు సంఘీభావంగా సిలికాన్ వ్యాలీలోని భారతీయ అమెరికన్లు ర్యాలీ నిర్వహించారు. మిల్పిటాస్ సిటీ హాల్‌లో అధిక సంఖ్యలో పాల్గొన్న భారతీయ అమెరికన్లను ఉద్దేశించి కమ్యూనిటీ నాయకులు మాట్లాడారు. హిందువులపై జరుగుతున్న దాడులపై మండిపడ్డారు. మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండించాలని, హిందూ మైనారిటీ జనాభాను రక్షించడానికి కెనడా, బంగ్లాదేశ్ ప్రభుత్వాలను బాధ్యులను చేయాలని నిరసనకారులు పిలుపునిచ్చారు.
'ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని ఆపండి, కెనడియన్-హిందువులను రక్షించండి', 'ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఆపండి, బంగ్లాదేశీ-హిందువులను రక్షించండి' అంటూ నినాదాలు చేశారు.
బ్రాంప్టన్లోని హిందూ సభ ఆలయంలో హిందూ భక్తులపై జరిగిన దాడి సరైనది కాదని నిరసనకారులు చెప్పారు. గత నెలలో కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాదులు హిందువులపై దాడి చేశారని చెప్పారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి పురుషులు, మహిళలు, పిల్లలపై దాడి చేయడం చూశామని ఆవేదన వ్యక్తం చేశారు.
దీపావళి పండుగను జరుపుకోవడానికి వెళ్లిన హిందువులను వేధించడం దారుణమన్నారు. పోలీసులు ఇప్పటికే ఖలిస్థానీ మద్దతుదారులతో కుమ్మక్కై హిందూ భక్తులను చితకబాదారన్నారు. కెనడాలో హింసను భావ ప్రకటనా స్వేచ్ఛగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. కెనడియన్ హిందువుల ప్రాథమిక మానవ హక్కులను పరిరక్షించడంలో ట్రూడో ప్రభుత్వంపై నమ్మకం పోయిందని నిరసనకారులు చెప్పారు.
కెనడాలోని హిందువులపై ఖలిస్థానీలు, బంగ్లాదేశ్‌లో దాడులను అమెరికన్స్ ఫర్ హిందుస్‌కు చెందిన డాక్టర్ రమేష్ జాప్రా ఖండించారు. మాది ఓ కుటుంబమని చెప్పారు. కెనడాలోని తన బృందాన్ని సిక్కుస్ ఫర్ జస్టిస్ లక్ష్యంగా చేసుకుందని అలయన్స్ ఆఫ్ హిందుస్ ఇన్ నార్త్ అమెరికా (సీఓహెచ్ఎన్ఏ)కు చెందిన పుష్పితా ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు.