Funny Moment: రనౌట్ ఛాన్స్.. కానీ వికెట్లని వదిలేసి బ్యాటర్ వీపుపైకి బంతిని విసిరిన బంగ్లాదేశ్ బౌలర్-bangladesh hasan mahmud direct throw misses stumps rather hits south african batter ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Funny Moment: రనౌట్ ఛాన్స్.. కానీ వికెట్లని వదిలేసి బ్యాటర్ వీపుపైకి బంతిని విసిరిన బంగ్లాదేశ్ బౌలర్

Funny Moment: రనౌట్ ఛాన్స్.. కానీ వికెట్లని వదిలేసి బ్యాటర్ వీపుపైకి బంతిని విసిరిన బంగ్లాదేశ్ బౌలర్

Galeti Rajendra HT Telugu
Oct 22, 2024 06:37 PM IST

Bangladesh vs South Africa 1st Test: లేని పరుగు కోసం దక్షిణాఫ్రికా బ్యాటర్ పరుగెత్తుకుంటూ పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. దాంతో బంతిని చేతికి అందుకున్న బంగ్లాదేశ్ బౌలర్ వికెట్లపైకి విసరకుండా.. బ్యాటర్‌పైకి విసిరి నవ్వులు పూయించాడు.

రనౌట్ మిస్ చేసిన హసన్
రనౌట్ మిస్ చేసిన హసన్ (Fancode)

బంగ్లాదేశ్ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ ఇంకా మెరుగైన ప్రమాణాల్ని అందుకోలేకపోతోంది. ఇటీవల భారత్ చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో పేలవంగా ఓడిపోయిన బంగ్లాదేశ్ టీమ్.. ప్రస్తుతం సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్‌ను సులువుగా రనౌట్ చేసే ఛాన్స్ దొరికినా.. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ పేలవంగా చేజార్చాడు.

ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకి ఆలౌటైంది. పదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన డేన్ పీట్ 87 బతుల్లో 2 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. అయితే.. ఫీట్‌ను ఆరంభంలోనే ఔట్ చేసే ఛాన్స్ బంగ్లాదేశ్‌కి వచ్చింది. కానీ.. ఫాస్ట్ బౌలర్ మహమూద్ హసన్ వృథా చేశాడు.

ఇన్నింగ్స్‌ 69వ ఓవర్‌లో మహ్మద్ హసన్ విసిరిన లో-ఫుల్ టాస్ బంతిని ఫీట్ స్ట్రైయిట్‌గా ఆడాడు. దాంతో ఆ బంతి బౌలర్ హసన్ చేతిని తాకి.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని వికెట్లను తాకింది. అయితే.. అప్పటికే రనౌట్ ప్రమాదాన్ని గ్రహించిన నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాటర్ కైల్ వెరియెన్ క్రీజులోనే బ్యాట్ ఉంచి నిల్చున్నాడు. అయితే.. బంతికి, బౌలర్‌కి ఉండటంతో.. సింగిల్ కోసం ఫీట్ పిలుస్తూ పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. కానీ.. బౌలర్ హసన్ రియాక్ట్ అవ్వడంతో కైల్ వెరియెన్ నిరాకరించాడు.

వాస్తవానికి అప్పుడు బంగ్లాదేశ్ పేసర్ నేరుగా వికెట్ కీపర్ లిట్టన్ దాస్ చేతికి బంతిని ఇచ్చి ఉంటే పీట్ ఔట్ అయ్యేవాడు. కానీ.. ఆవేశంగా హసన్‌ బంతిని తీసుకుని విసరబోయాడు. అయితే.. ఆ బంతి వికెట్ల వైపు కాకుండా పీట్ వీపుమీదకి వెళ్లింది. దాంతో లిట్టన్ దాస్‌తో పాటు బంగ్లాదేశ్ ప్లేయర్లు కూడ చాలా నిరాశపడుతూ కనిపించారు. అయితే.. హసన్ త్రోని విసిరిన తీరుని రిప్లేలో చూసిన తర్వాత స్టేడియంలో అందరూ నవ్వుకుంటూ కనిపించారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకి ఆలౌటగా.. దక్షిణాఫ్రికా టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేసింది. దాంతో.. 202 పరుగుల లోటుతో ప్రస్తుతం బంగ్లాదేశ్ టీమ్ రెండో ఇన్నింగ్స్ ఆడుతూ మంగళవారం ఆట ముగిసే సమయానికి 101/3తో ఉంది. బంగ్లాదేశ్ ఇంకా 101 పరుగులు వెనకబడి ఉంది.

Whats_app_banner