తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Income Tax Return (Itr) Filing: ఐటీఆర్ డెడ్‌లైన్ మిస్సయితే ఇదీ పరిస్థితి..

income tax return (ITR) filing: ఐటీఆర్ డెడ్‌లైన్ మిస్సయితే ఇదీ పరిస్థితి..

HT Telugu Desk HT Telugu

29 July 2022, 17:41 IST

google News
  • income tax return (ITR) filing: మీరు ఇప్పటికే రిటర్న్‌ని ఫైల్ చేసి ఉంటే ఓకే. మీరు జూలై 31 గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైతే ఏమి జరుగుతుంది?

ఐటీ రిటర్నులకు గడువు తేదీ జూలై 31
ఐటీ రిటర్నులకు గడువు తేదీ జూలై 31 (HT_PRINT)

ఐటీ రిటర్నులకు గడువు తేదీ జూలై 31

income tax return (ITR) filing: 2021-22 ఆర్థిక సంవత్సరం లేదా 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (income tax return) దాఖలు చేయడానికి గడువు తేదీ జూలై 31, 2022.

మీరు జూలై 31 గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే డిసెంబర్ 31, 2022లోపు రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. అయితే అందుకు మీరు ఆలస్య రుసుం చెల్లించాలి. అంతేకాకుండా ఇతర ఆర్థిక అంశాలు కూడా ముడివడి ఉంటాయి.

వార్షిక ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఆలస్య రుసుం రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. మీ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆలస్య జరిమానా రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది.

అయితే మీ మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించకపోతే, ఆలస్యంగా దాఖలు చేసినందుకు మీరు పెనాల్టీని చెల్లించాల్సిన బాధ్యత ఉండదు.

ప్రాథమిక మినహాయింపు పరిమితి మీరు ఎంచుకున్న ఆదాయపు పన్ను విధానంపై ఆధారపడి ఉంటుంది. పాత ఆదాయపు పన్ను విధానంలో 60 ఏళ్లలోపు పన్ను చెల్లింపుదారులకు ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షలు.

60 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ. 3 లక్షలు. 80 ఏళ్లు పైబడిన వారికి మినహాయింపు పరిమితి రూ. 5 లక్షలు.

కొత్త రాయితీ ఆదాయపు పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారుల వయస్సుతో సంబంధం లేకుండా ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షలు.

స్థూల మొత్తం ఆదాయం అనేది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 80సీ నుండి 80యూ వరకు తగ్గింపులను పరిగణనలోకి తీసుకోక ముందున్న ఆదాయం.

income tax return (ITR) filing చేయకపోతే ఇవీ ఇక్కట్లు..

ఆలస్య రుసుం ఛార్జీలు మాత్రమే కాకుండా, పన్నులు ఆలస్యంగా చెల్లించడంపై వడ్డీని చెల్లించవలసి ఉంటుంది.

‘ఉదాహరణకు ఐటీఆర్ ఫైల్ చేసే సమయానికి టీడీఎస్ 10 శాతం శ్లాబులో కోత విధించారనుకుందాం. కానీ మీరు 20 శాతం లేదా 30 శాతం పన్ను శ్లాబులోకి వస్తే చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని వడ్డీతో చెల్లించాలి. సెక్షన్ 234 ఏ ప్రకారం నెలకు 1 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది..’ అని టాక్స్‌స్పానర్ సహ వ్యవస్థాపకుడు సీఈవో సుధీర్ కౌశిక్ అన్నారు.

మీరు గడువు తేదీకి ముందు రిటర్న్‌ను ఫైల్ చేస్తే, మీరు బకాయి ఉన్న పన్నును జమ చేయవచ్చు. అయితే గడువు దాటితే జూలై 31 నుండి వడ్డీతో పాటు బాకీ ఉన్న పన్నును జమ చేయాల్సి ఉంటుంది.

ఇతర ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన నష్టాలకు గడువు తేదీ లోపు ఐటీ రిటర్నులు దాఖలు చేస్తే మినహాయింపు కోరవచ్చు.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, జీతం నుండి వచ్చే ఆదాయం మినహా ఏదైనా ఆదాయానికి సంబంధించి వ్యాపార నష్టాన్ని మినహాయింపు కోరవచ్చు. ఉదాహరణకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో సంభవించిన వ్యాపార నష్టాలను 2021-22 ఆర్థిక సంవత్సరంలో, తదుపరి సంవత్సరాల్లో వ్యాపార ఆదాయం నుంచి మినహాయింపు కోరవచ్చు.

గడువులోపు ఐటీ రిటర్ను దాఖలు చేయనిపక్షంలో ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు అందుకోవచ్చు.

‘ఒకవేళ మీరు 31 డిసెంబర్ 2022 గడువులోపు కూడా ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయనిపక్షంలో రీఫండ్‌లు, నష్టాలు, ఫార్వార్డ్ చేసిన నష్టాల కోసం మీరు మీ స్థానిక ఆదాయపు పన్ను కమిషనర్‌ వద్ద అప్పీల్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. కారణం ఒక వేళ సహేతుకమైనదే అయితే అనుమతి పొందవచ్చు..’ అని కౌశిక్ చెప్పాడు.

మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటే భారీ జరిమానా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పన్ను మొత్తంలో 50 శాతం నుంచి 100 శాతం అదనంగా చెల్లించాలి.

కొసమెరుపు ఏంటంటే మీరు జూలై 31వ తేదీ గడువు లోపే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేసినా.. ఒకవేళ మీరు అడ్వాన్స్‌గా ఇన్‌కమ్ టాక్స్ కట్టని పక్షంలో దాదాపు 10 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

అందువల్ల ఇన్‌కమ్ టాక్స్‌ రిటర్న్‌ను నిర్లక్ష్యం చేయకుండా గడవులోపే సబ్‌మిట్ చేసేయండి.

తదుపరి వ్యాసం