Income Tax Return: ఫ్రీలాన్స్ ఇన్‌కమ్ ఉందా?
25 July 2022, 17:59 IST
- Income Tax Return: ఫ్రీలాన్సింగ్ ఆదాయం ఉండే వ్యక్తులకు లేదా పెన్షనర్లకు వారి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ప్రకారంగా ఆ ఏడాదికి సంబంధించి పన్ను చెల్లింపుల దాఖలు కోసం పాత, కొత్త పన్ను విధానాలకు మారడానికి అనుమతిస్తుంది. అయితే ఈ నియమాలు అందరికీ ఒకేలా ఉండవు
Income Tax
Income Tax Return: ఫ్రీలాన్సింగ్ అంటే ఒక నిర్దిష్ట కాలపరిమితి కోసం చేపట్టే పని లేదా తాత్కాలికమైన ఒక ఉపాధి. ఫ్రీలాన్సింగ్ చేసే వ్యక్తి కంపెనీకి చెందిన ఉద్యోగి కాదు, వారిని పేరోల్‌లో చేర్చరు. అంతేకాకుండా కంపెనీల చట్టంలో నిర్దేశించిన విధంగా ఆ వ్యక్తికి ప్రావిడెంట్ ఫండ్ లాంటి ప్రోత్సాహకాలు పొందే అర్హత లేదు. వారికి ఇచ్చిన అసైన్‌మెంట్ పూర్తయిన తర్వాత కాంట్రాక్ట్ ప్రకారం కంపెనీ నగదు చెల్లింపులు చేస్తుంది.
అందరికీ ఒకే నియమాలు వర్తించవు..
ఇలాంటి కేసులలో 2020 యూనియన్ బడ్జెట్ తక్కువ పన్ను రేట్లతో నూతన పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. చెల్లింపుదారుడు క్లెయిమ్ చేయడానికి తక్కువ పన్ను మినహాయింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా ఫ్రీలాన్సింగ్ ఆదాయం ఉండే వ్యక్తులకు లేదా పెన్షనర్లకు వారి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ప్రకారంగా చెల్లింపుల దాఖలు కోసం పాత, కొత్త పన్ను విధానాలకు మారడానికి అనుమతిస్తుంది. అయితే ఈ నియమాలు అందరికీ ఒకేలా ఉండవు. వ్యాపార ఆదాయం ఉన్నవారికి ఈ వెసులుబాటు అరుదు. వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం కూడా ఫ్రీలాన్స్ కిందే లెక్కిస్తారు. కాబట్టి వేతనం పొందుతూ, ఫ్రీలాన్స్ ఆదాయం కలిగి ఉంటే కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు విధానాలకు మారే సౌకర్యం ఉండదు.
వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం నిలిచిపోతే మాత్రం తరువాతి మదింపు సంవత్సరాలలో వారికి రెండు విధానాలలో ఏదైనా ఒకదానికి మార్చుకునే అవకాశం ఉంటుంది.
ఆదాయం నుంచి పన్ను మినహాయింపు..
వ్యక్తి తన ఫ్రీలాన్స్ వృత్తిలో అందుకున్న అన్ని చెల్లింపులు అతని స్థూల రాబడిని సూచిస్తాయి. అయితే తన వృత్తి నిమిత్తం ఫ్రీలాన్సర్ చేసే ఖర్చులు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి మినహాయింపు ఉంటుంది.
ఉదాహారణకు ఒక ఫోటోగ్రాఫర్ నెలకు రూ. 50 వేలు సంపాదిస్తున్నాడనుకుంటే, అతడు తన వృత్తిలో భాగంగా చేసే ఖర్చులు అనగా ప్రయాణ ఖర్చులు, కెమెరా రిపేర్ ఖర్చులు, సహాయక సిబ్బందికి ఇచ్చే భత్యాలు, ఇతరత్రాలు అన్నీ అతడి సంపాదన నుంచి ఖర్చు అవుతున్నాయి. కాబట్టి ఈ ఖర్చులు మినహాయించి మిగతా ఆదాయానికి మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పైన చెప్పిన కేసును మినహాయిస్తే, మిగిలిన కేసుల్లో పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన పాత లేదా నూతన విధానాల్లో ఏదైనా ఒక విధానాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి కొత్త విధానాన్ని ఎంచుకున్న తర్వాత వారు భవిష్యత్తులో ఐటీఆర్ దాఖలు చేసేందుకు మళ్లీ పాత విధానానికి మార్చుకునే అవకాశం ఉండదు.