Sena vs Sena : ఠాక్రే- ఏక్నాథ్ వర్గాలకు కొత్త పేర్లు.. ఈసీ కీలక నిర్ణయం
10 October 2022, 21:25 IST
- Sena vs Sena : శివసేనలోని రెండు వర్గాలకు రెండు వేరువేరు పేర్లు ఇచ్చింది ఈసీ. వీటితో పాట ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పార్టీ చిహ్నాన్ని కూడా ఇచ్చింది.
ఠాక్రే- ఏక్నాథ్ వర్గాలకు కొత్త పేర్లు.. ఈసీ కీలక నిర్ణయం
Sena vs Sena : 'శివసేన' రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్ధవ్‌ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలకు కొత్త పేర్లు వచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే' పేరు ఇచ్చింది ఎన్నికల సంఘం. 'టార్చ్'ని ఎన్నికల గుర్తుగా కేటాయించింది.
ఇక మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి.. 'బాలాసాహెబంచి శివసేన' అనే పేరు ఖరారు చేసింది ఈసీ. కాగా పార్టీ గుర్తును ఇంకా కేటాయించలేదు. మంగళవారం ఉదయం 10 గంటల కల్లా మూడు అప్షన్లను సమర్పించాలని స్పష్టం చేసింది. వాటిల్లో ఒకదానిని నిర్ణయిస్తుంది.
Shiva Sena Uddhav Thackeray : 'శివసేన బాలాసాహెబ్ ఠాక్రే', 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే', 'శివసేన బాలాసాహెబ్ ప్రబోధనకర్ ఠాక్రే' పేర్లను ఎన్నికల సంఘం ముందు పెట్టింది ఠాక్రే వర్గం. వాటిల్లో రెండో పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈసీ.
శివసేన పేరు, చిహ్నాన్ని ఎన్నికల సంఘం గత వారం ఫ్రీజ్ చేసింది. కొత్తగా పేర్లు, చిహ్నాలను చెప్పాలని ఇరు వర్గాలను ఆదేశించింది. ఈ క్రమంలోనే రెండు వర్గాలు కొత్త పేర్లను సిఫార్సు చేశాయి.
Shiv Sena Eknath Shinde : పార్టీ పేరును ఫ్రీజ్ చేయడంపై ఈసీకి వ్యతిరేకంగా ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ఎలాంటి విచారణ లేకుండానే, పేరును ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. ఇది న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని అన్నారు.
ముంబై అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి వచ్చే నెలలో ఉపఎన్నిక జరగనుంది. ఈలోపు పార్టీ పేర్లు, చిహ్నాలను ఎన్నుకోవాలని ఇరు వర్గాలకు సూచించింది ఎన్నికల సంఘం.
అసలు కారణం ఇది..
ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో మహా వికాస్ అఘాడీలో రెండున్నరేళ్ల పాటు సీఎంగా కొనసాగారు ఉద్ధవ్ ఠాక్రే. కానీ ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో కథ అడ్డం తిరిగింది. అనేకమంది ఎమ్మెల్యేలు షిండే వెంట వెళ్లిపోయారు. ఫలితంగా పార్టీ రెండుగా చీలిపోయింది.
ఆ తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఏక్నాథ్ షిండే. ఆయనకు సీఎం పదవిని ఇచ్చింది బీజేపీ. అప్పటి నుంచి శివసేన వర్గాల మధ్య రాజకీయ, న్యాయ పోరాటం నడుస్తోంది. పార్టీ పేరు, చిహ్నంపై ఇరు వర్గాలు పోరాటానికి దిగాయి.