Uddhav vs Shinde: ఇరు ‘సేన’లకూ నిరాశే..!
Uddhav vs Shinde: మహారాష్ట్రలోని శివసేనలో నెలకొన్న సంక్షోభం పర్యవసానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలైన శివసేన ఎవరిదనే విషయం నుంచి, పార్టీ జెండా, పార్టీ గుర్తు ఎవరికి చెందుతాయనే విషయం వరకు ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
Uddhav vs Shinde: మహారాష్ట్రలో శివసేన రెండుగా చీలి, ఏక్ నాథ్ షిండే వర్గం బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. నాటి నుంచి, అసలైన శివసేన తమదేనని షిండే వర్గం, ఉద్ధవ్ ఠాక్రే వర్గం వాదిస్తూనే ఉన్నాయి. ఈ వివాదం ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.
Uddhav vs Shinde: రెండింటికీ ఇవ్వం..
తాజాగా, శివసేన పార్టీ గుర్తు అయిన విల్లంబులు(bow and arrow)ను ప్రస్తుతానికి ఎవరికీ కేటాయించడం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని అంధేరీ తూర్పు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ గుర్తును తమకే కేటాయించాలని షిండే, ఠాక్రే వర్గాలు ఈసీని ఆశ్రయించాయి. దాంతో, ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
Uddhav vs Shinde: వేరే గుర్తు ఇస్తాం..
ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్ నాథ్ షిండే వర్గం కోరుకుంటే, వారికి ఫ్రీ సింబల్స్ నుంచి వేర్వేరు గుర్తులు కేటాయిస్తామని ఈసీ తెలిపింది. తాము నిర్ణయం వెలువరించే వరకు ఈ వర్గం కూడా శివసేన పేరును కానీ, గుర్తును కానీ వాడకూడదని ఆదేశించింది. రెండు వర్గాలు కూడా తాము కోరుకుంటున్న 3 గుర్తులను ప్రాధాన్యతాక్రమంలో అక్టోబర్ 10 లోగా ఈసీకి తెలియజేయాలని, వాటిలో ఒక్కో గుర్తును కేటాయిస్తామని వివరించింది. శివసేన ఓనర్ షిప్ విషయమై తుది నిర్ణయం తీసుకునేవరకు ఈ ఆదేశాలు చెల్లబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.