Mumbai Rains : ఐఎండీ అలర్ట్.. ముంబయిలో భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
26 September 2024, 11:50 IST
- IMD Rain Alert To Mumbai : ముంబయిలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ, రేపు భారీ వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ముంబయి వర్షాలు
రాబోయే కొద్ది గంటల్లో ముంబయిలో భారీ వర్షాలు కురుస్తాయని IMD వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముంబై తీరంలో మరింత వాన పడే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటలలో ముంబైలోని కొన్ని ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ముంబై నగరం, సబర్బ్‌లో ఉరుములతో కూడిన మెరుపులు ఉంటాయని ఐఎండీ పేర్కొంది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు వర్షాల కారణంగా నగరంలో ఇప్పటి వరకూ నలుగురు మృతి చెందారు. భారీ వర్షపాతం హెచ్చరికల దృష్ట్యా, ముంబై, థానే, పాల్ఘర్, పింప్రి-చించ్వాడ్‌తో సహా పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.
భారీ వర్షాలు ముంబయి నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. లోకల్ రైళ్లను వాటి ట్రాక్‌లలో ఆపివేశారు. కనీసం 14 ఇన్‌కమింగ్ ఫ్లైట్లను మళ్లించారు. ఇంకోవైపు పలు రైళ్లను రద్దు చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. గురువారం పాల్ఘర్, నాసిక్‌లలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. థానే, రాయ్‌ఘడ్, ముంబై, పూణేలలో కూడా హెచ్చరిక జారీ చేసింది.
బుధవారం సాయంత్రం నుంచి ముంబై నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో భారీ వర్షాల కారణంగా పూణేలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రద్దు అయింది.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడం మానుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో కూడా వానలు ఉంటాయని ఐఎండీ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో రోజంతా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) సూచించింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.