IMD rain alert : ఒకేసారి 15 రాష్ట్రాలకు ఐఎండీ యెల్లో అలర్ట్- ఏపీ, తెలంగాణకు కూడా..
06 September 2024, 7:01 IST
- Telanga Rain news today : రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఓ వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు ఇలా..
నైరుతి రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది.
దేశ రాజధానిలో పగటి పూట ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని దిల్లీ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దేశరాజధాని దిల్లీలో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. సెప్టెంబర్ 9వ తేదీ వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగనున్నాయి. శుక్రవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది.
ఇక ఆర్థిక రాజధాని ముంబైలో సెప్టెంబర్ 11 వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30, 26 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
పశ్చిమ- మధ్య భారతంలో..
“పశ్చిమ భారతదేశం, మధ్య భారతంలోని ఛత్తీస్గఢ్లో చాలా విస్తృతమైన తేలికపాటి / మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 12 వరకు మధ్య భారతంలో తేలికపాటి/మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది,” అని ఐఎండీ పేర్కొంది.
దక్షిణ ద్వీపకల్పానికి ఐఎండీ సూచనలు..
సెప్టెంబర్ 5 నాటి వాతావరణ బులెటిన్ ప్రకారం.. “08 -11 మధ్య కేరళ, మాహేలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది; 06 -08 వ తేదీలలో కోస్తాంధ్ర- యానాం. తెలంగాణలో సెప్టెంబర్ 8 వరకు, కర్ణాటకలో సెప్టెంబర్ 9 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది,” అని వివరించింది.
తూర్పు, ఈశాన్య భారతం..
సెప్టెంబర్ 11న నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో, సెప్టెంబర్ 7న అసోం, మేఘాలయలో, మరో రెండు రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ తెలిపింది.
వాయవ్య భారతానికి హెచ్చరికలు..
రాజస్థాన్లో సెప్టెంబర్ 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. సెప్టెంబర్ 6న ఉత్తరప్రదేశ్లో, సెప్టెంబర్ 9 వరకు రాజస్థాన్లో, సెప్టెంబర్ 7 వరకు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పలు ప్రాంతాల్లోని అధికారులు స్పష్టం చేశారు. వర్ష ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నాయి. ప్రజలకు సాయం చేసేందుకు కృషి చేస్తున్నాయి.