తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hurricane Milton : ఫ్లోరిడాపై 'మిల్టన్​' పిడుగు- తుపానుతో భారీ నష్టం.. కానీ!

Hurricane Milton : ఫ్లోరిడాపై 'మిల్టన్​' పిడుగు- తుపానుతో భారీ నష్టం.. కానీ!

Sharath Chitturi HT Telugu

11 October 2024, 10:30 IST

google News
  • Hurricane Milton live :కేటగిరీ 3 హరికేన్​గా ఫ్లోరిడాను తాకిన మిల్టన్ తుపాను చాలా ప్రాంతాల్లో అల్లకల్లోలాన్ని సృష్టించింది. లక్షలాది మంది ప్రజలపై ఈ ప్రభావం పడింది. అయితే ఇది అత్యంత దారుణమైన పరిస్థితి కాదని ఫ్లోరిడా గవర్నర్ డిశాంటిస్ వెల్లడించారు.

ఫోర్ట్​ పియర్సెలో తుపాను అనంతర పరిస్థితులు..
ఫోర్ట్​ పియర్సెలో తుపాను అనంతర పరిస్థితులు.. (AP)

ఫోర్ట్​ పియర్సెలో తుపాను అనంతర పరిస్థితులు..

హెలెన్​ తుపాను అలజడి నుంచి ఇంకా కోలుకోని అమెరికా ఫ్లోరిడాపై 'మిల్టన్​' పిడుగు పడింది! ఈ మిల్టన్​ తుపాను ఫ్లోరిడాను తాకడంతో డజనుకుపైగా టోర్నడోలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. లక్షలాది మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వందల ఇళ్లు దెబ్బతిన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.

అయితే మిల్టన్ హరికేన్​ ప్రభావం ఊహించిన దాని కన్నా తక్కువగానే ఉందని అధికారులు వెల్లడించారు.

"తుపాను తీవ్రంగానే ఉంది. కానీ ఇది "అత్యంత దారుణమైన పరిస్థితి కాదు," అని గవర్నర్ రాన్ డిశాంటిస్ అన్నారు. తాను కొన్ని ప్రభావిత ప్రాంతాలను పరిశీలిచినప్పుడు, ఇటీవలి సంవత్సరాలలో నిర్మించిన అనేక గృహాలు చెక్కుచెదరలేదని ఆయన పేర్కొన్నారు.

"ప్రజల్లో చాలా ధైర్యాన్ని చూశాను, నేను చాలా పట్టుదలను చూశాను. ఈ ప్రాంతం చాలా త్వరగా పుంజుకుంటుందని నేను చాలా నమ్మకంగా ఉన్నాను," అని గల్ఫ్ తీరంలో తుపాను తీరాన్ని తాకిన ప్రాంతానికి సమీపంలో ఉన్న సరాసోటాలో విలేకరుల సమావేశంలో డిశాంటిస్ అన్నారు.

మిల్టన్ తుపాను ఎక్కడ తీరం దాటింది? తరువాత ఎక్కడికి వెళ్లింది?

టంపా బే ప్రాంతానికి దక్షిణంగా 70 మైళ్ల (110 కిలోమీటర్లు) దూరంలో సియెస్టా కీ వద్ద కేటగిరీ 3 తుపానుగా మిల్టన్ బుధవారం సాయంత్రం తీరాన్ని దాటింది. 3.3 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్న టంపా బే ప్రాంతం ప్రత్యక్షంగా దెబ్బతినకుండా తప్పించుకున్నప్పటికీ, ఇంకా వరదల ప్రభావం ఆ ప్రాంతంపై ఉంది.

గురువారం మధ్యాహ్నానికల్లా మిల్టన్ తుపాను ఫ్లోరిడా తూర్పు తీరం నుంచి కదిలింది. తీవ్ర తుపాను సమయంలో కనిపించే గాలులు కూడా పెద్దగా కనిపించలేదు.

నష్టం ఎంత తీవ్రంగా ఉంది?

మిల్టన్​ తుపాను ధాటికి విద్యుత్ లైన్లు కూలిపోయాయి. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. వంతెనలు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మిల్టన్ తీరం దాటకముందే దక్షిణ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, టోర్నడోలు సంభవించాయి.

తుపాను కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది. 30 లక్షలకు పైగా ఇళ్లు, వ్యాపారాలకు విద్యుత్ లేకుండా పోయాయని poweroutage.us తెలిపింది.

సెయింట్ పీటర్స్​బర్గ్​లో 46 అంతస్తుల భవనంలో పనిచేస్తున్న క్రేన్ కూలిపోవడం, వాటర్ మెయిన్ బ్రేక్ పడటంతో నగరంలో సేవలను నిలిపివేశారు. టంపా బే రేస్ బేస్​బాల్ జట్టుకు నిలయమైన ట్రోపికానా ఫీల్డ్ పైకప్పు కూడా ధ్వంసమైంది!

సెయింట్ పీటర్స్​బర్గ్ ప్రాంతంలో దాదాపు 19 ఇంచ్​ (48 సెంటీమీటర్లు) వర్షం కురిసినట్లు నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.

మిల్టన్​ తుపానుతో ప్రాణ నష్టం?

మిల్టన్​ తుపాను కారణంగా గురువారం మధ్యాహ్నానికి కనీసం ఆరుగురు మరణించినట్లు అధికారులు నివేదించారు. అట్లాంటిక్ తీరంలోని ఫోర్ట్ పియర్స్ సమీపంలోని స్పానిష్ లేక్స్ కంట్రీ క్లబ్​లో టోర్నడో కారణంగా ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. టంపాలో గురువారం ఉదయం ఓ పెద్ద చెట్టు కొమ్మ కింద 70 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైనట్లు వెల్లడించారు. ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు కనీసం 340 మందిని, 49 పెంపుడు జంతువులను రక్షించామని గవర్నర్​ డీశాంటిస్ చెప్పారు.

తదుపరి వ్యాసం