Hurricane Milton : ఫ్లోరిడాలోని తెలుగు ప్రజలు జాగ్రత్త- మిల్టన్ తుపానుతో భారీ నష్టం!
Hurricane Milton news : హెలెన్ తుపానుతో విలవిలలాడిన అమెరికా ఫ్లోరిడావైపు ఇప్పుడు మరో శక్తివంతమైన హరికేన్ దూసుకెళుతోంది. మిల్టన్ తుపానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
కొన్ని రోజుల క్రితం హెలెన్ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని అమెరికా ఫ్లోరిడాపై మరో పిడుగు! మిల్టన్ తుపాను ఆ ప్రాంతంవైపు శరవేగంగా దూసుకెళుతోంది. మిల్టన్‌ని ఇప్పటికే కేటగిరీ 5 హరికేన్‌గా గుర్తించారు.
ఫ్లోరిడా ప్రజలు జాగ్రత్త..!
3.3 మిలియన్లకు పైగా జనాభా ఉన్న జనసాంద్రత కలిగిన ఫ్లోరిడాలోని టంపా మెట్రో ప్రాంతాన్ని మిల్టన్ తుపాాను నేరుగా ఢీకొనే అవకాశం ఉంది. హెలెన్ ధాటికి ఇప్పటికే ఈ ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
ఓవైపు హెలెన్ తుపాను కారణంగా ఏర్పడిన శిథిలాలను అధికారులు ఇంకా పూర్తిస్థాయిలో తొలగించకముందే మిల్టన్ దూసుకొస్తుండటం సర్వత్రా ఆందోళన నెలకొంది. తుపాను నుంచి బయటపడేందుకు ముప్పు ప్రాంతాల్లోని ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.
మిల్టన్ తుపానుతో అలర్ట్‌గా ఉండాలని ప్రజలను అధికారులు హెచ్చరించారు.
మిల్టన్ ఎప్పుడు తీరం దాటుతుంది?
నేషనల్ హరికేన్ సెంటర్ లైవ్ ట్రాకర్ ప్రకారం.. మిల్టన్ బుధవారం ఫ్లోరిడా పశ్చిమ తీరంలో తీరం దాటనుంది. వందేళ్లకు పైగా పెద్ద తుపానును ఎదుర్కోని టంపా బే ప్రాంతాన్ని తాకినప్పుడు ఇది కాస్త బలహీనపడి కేటగిరీ 3 తుపానుగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మధ్య ఫ్లోరిడా మీదుగా అట్లాంటిక్ మహాసముద్రం వైపు దూసుకొస్తున్నందున మిల్టన్ తుపాను బలం తగ్గడం లేదు. అయితే ఫ్లోరిడా నుంచి కరోలినాస్కు వెళ్లే దారిలో కనీసం 230 మందిని పొట్టనబెట్టుకున్న హెలెన్ తుపాను ముప్పు ప్రాంతాలపై మిల్టన్ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు.
ఇప్పుడు తుపాను ఎక్కడ ఉంది?
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం నాటికి తూర్పు గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గర కేంద్రీకృతమైంది.
ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం అంచనా వేసిన దానికంటే మిల్టన్ హరికేన్ ఇప్పటికీ చాలా బలంగా ఉందని చెప్పారు.
గంటకు 180 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, సోమవారం మధ్యాహ్నం సమయానికి తాంపాకు నైరుతి దిశగా 675 మైళ్ల (1,085 కిలోమీటర్లు) దూరంలో తుపాను కేంద్రీకృతమైందని నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది.
టంపా బేలో 8 నుంచి 12 అడుగుల ఎత్తు (2.4 నుంచి 3.6 మీటర్లు) వరకు తుపాను విజృంభించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. హెలెన్ సమయంలో రెండు వారాల క్రితం చేరుకున్న స్థాయిల కంటే ఇది రెట్టింపు స్థాయి అని నేషనల్ హరికేన్ సెంటర్ ప్రతినిధి మారియా టోర్రెస్ తెలిపారు.
ఈ తుపాను కూడా విస్తారంగా వరదలను తీసుకురావచ్చు. ఫ్లోరిడా ప్రధాన భూభాగం, కీస్లో ఐదు నుంచి 10 అంగుళాల (13 నుండి 25 సెంటీమీటర్లు) వర్షపాతం నమోదవుతుందని అంచనాలు ఉన్నాయి. కొన్ని చోట్ల 15 అంగుళాలు (38 సెంటీమీటర్లు) వరకు ఉంటుందని అంచనా ఉంది.
మంగళవారం ఉదయం 9 గంటలకు విమానాలను నిలిపివేస్తున్నట్లు టంపా అంతర్జాతీయ విమానాశ్రయం తెలిపింది. ఇది ప్రజలకు లేదా వారి కార్లకు షెల్టర్ కాదని విమానాశ్రయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
సెయింట్ పీట్ క్లియర్వాటర్ అంతర్జాతీయ విమానాశ్రయం తప్పనిసరి తరలింపు జోన్లో ఉందని, మంగళవారం చివరి విమానం బయలుదేరిన తర్వాత మూసివేస్తామని తెలిపింది.
సంబంధిత కథనం