వియత్నాంలో యాగి విధ్వంసం.. తుపాను కారణంగా 59 మృతి.. వంతెన కూలిపోయి పలువురు గల్లంతు
Typhoon Yagi : చైనా, హంకాంగ్‌లో బీభత్సం సృష్టించిన టైఫూన్ యాగి వియత్నంలో విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ తుపానుతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. తాజాగా ఓ వంతెన కూలిపోయి చాలా మంది గల్లంతయ్యారు.
కనీసం 59 మంది మరణాలకు కారణమైన టైఫూన్ యాగి వియత్నాంలో విలయం సృష్టిస్తోంది. ఎక్కువ వర్షం పడటంతో సోమవారం ఒక వంతెన కూలిపోయి, బస్సు కొట్టుకుపోయిందని స్థానిక మీడియా నివేదించింది. ఈ తుపాను కారణంగా చాలా మంది మరణించారు. శనివారం వియత్నాంలో వచ్చిన వరదలు, కొండచరియలు విరిగిపడటం కారణంగా 50 మంది మరణించారు. తర్వాత మరో 9 మంది మృతి చెందారు.
ఉత్తర వియత్నాంలో అనేక నదుల నీటి మట్టాలు ప్రమాదకరంగా ఉన్నాయి. సోమవారం ఉదయం పర్వత కావో బ్యాంగ్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో 20 మంది ప్రయాణికుల బస్సు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. అయితే కొండచరియలు విరిగిపడటంతో సంఘటన జరిగిన ప్రదేశానికి మార్గం మూసుకుపోయింది.
ఫుథో ప్రావిన్స్‌లో రెడ్ రివర్‌పై ఉక్కు వంతెన సోమవారం ఉదయం కూలిపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెండు మోటార్‌బైక్‌లతో పాటు 10 కార్లు, ట్రక్కులు నదిలో పడిపోయాయని నివేదికలు తెలిపాయి. ముగ్గురిని నదిలో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మరో 13 మంది గల్లంతయ్యారు.
'మోటార్‌సైకిల్‌పై వంతెన మీద వెళ్తున్నప్పుడు పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నదిలో పడిపోయాను. నేను నది దిగువకు మునిగిపోయినట్లు అనిపించింది. ఎలాగోలా ఈత కొడుతూ బయట పడ్డాను.' అని ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి స్థానిక మీడియాకు చెప్పాడు.
టైఫూన్ యాగి కొన్ని దశాబ్దాలలో వియత్నాంను తాకిన బలమైన తుపాను. ఇది శనివారం 149 కి.మీ వేగంతో గాలులతో తీరాన్ని తాకింది. ఆ దేశ వాతావరణ సంస్థ ఇప్పటికీ కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు రావొచ్చని, కొండచరియలు విరిగిపడవచ్చని హెచ్చరించింది.
ఆదివారం సాపా పట్టణంలో కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మరణించారు. తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ప్రదేశం పర్వతాలకు ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రాంతం. వియత్నాం రాజధాని హనోయిలో ఆకాశం మేఘావృతమై ఉంది. సోమవారం ఉదయం అక్కడక్కడా వర్షాలు కురిశాయి. నేలకొరిగిన చెట్లు, పడిపోయిన బిల్‌బోర్డ్‌లు, నేలకూలిన విద్యుత్ స్తంభాలను అధికారులు తొలగిస్తున్నారు. వాయువ్య వియత్నాంలో భారీ వర్షం కొనసాగుతోంది. కొన్ని ప్రదేశాలలో 40 సెంటీమీటర్లు దాటవచ్చని అంచనా వేస్తున్నారు.
క్వాంగ్ నిన్, హైఫాంగ్ ప్రావిన్సులలో కనీసం 3 మిలియన్ల మంది ప్రజలు విద్యుత్తు లేకుండా ఇబ్బందులు పడ్డారు. ఇంకా విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. ఈ రెండు ప్రావిన్సులలో ఉన్న పారిశ్రామిక కేంద్రాలు నీటిలోనే ఉన్నాయి. ఫ్యాక్టరీ కార్మికులు అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ.. అనేక పారిశ్రామిక పార్కులు జలమయమయ్యాయని, చాలా ఫ్యాక్టరీల పైకప్పులు ఎగిరిపోయాయని చెప్పారు.
యాగి తుపానుతో దాదాపు 116,192 హెక్టార్లలో వ్యవసాయ భూమి కూడా దెబ్బతింది. వియత్నాంను తాకడానికి ముందు, యాగి గత వారం ఫిలిప్పీన్స్‌లో కనీసం 20 మరణాలకు, దక్షిణ చైనాలో నాలుగు మరణాలకు కారణమైంది.