Hurricane Idalia: జార్జియా, కరొలినా రాష్ట్రాలను వణికిస్తున్న హరికేన్ ఇడాలియా
Hurricane Idalia: అమెరికాలోని కరొలినా రాష్ట్రాలను, జార్జియా, ఫ్లారిడాలను హరికేన్ ఇడాలియా (Hurricane Idalia) వణికిస్తోంది. ఈ భారీ తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్రమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Hurricane Idalia: ఫ్లారిడాలోని తీర ప్రాంతాలను ముంచేసిన హరికేన్ ఇడాలియా (Hurricane Idalia) కొంత బలహీనపడి పక్కనున్న జార్జియాలో, కరొలినా రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రభావం చూపుతోంది. ఈ తుపాను ప్రభావానికి ఫ్లారిడాలో మెజారిటీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈదురుగాలులు, తీవ్రమైన వర్షాలు, భారీ అలలతో తీర ప్రాంతం అతలాకుతలమైంది. ఈ ప్రాంతంలో ఒక్క రోజులోనే 25 సెంమీల వర్షపాతం నమోదైంది.ముఖ్యంగా వాయువ్య ఫ్లారిడా ప్రాంతంలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు.
ప్రాణ నష్టం లేదు..
అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు ఈ హరికేన్ కారణంగా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, ఈ హరికేన్ వల్ల కలిగిన నష్టంపై పూర్తి వివరాలు అందిన తరువాత ఈ విషయంలో ఒక స్పష్టత వస్తుందని తెలిపారు. హరికేన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రహదారులు ధ్వంసం కావడంతో మారు మూల ప్రాంతాలకు చేరుకోలేకపోతున్నామని వెల్లడించారు.
కేటగిరీ 3 తుపాను
ఇడాలియాను కేటగిరీ 3 తుపాను గా ప్రకటించారు. ఈ తుపాను కారణంగా కీటన్ బీచ్ ప్రాంతంలో గరిష్టంగా 215 కిమీ ల వేగంతో గాలులు వీచాయని అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించింది. అలాగే సుమారు 16 అడుగుల ఎత్తుతో అలలు ఎగసిపడ్డాయని తెలిపింది. బలహీన పడిన అనంతరం ఈ హరికేన్ కేటగిరీని 1 కి తగ్గించారు. మరో రెండు రోజులు నార్త్ కరొలినాలో ఈ తుపాను ప్రభావం ఉంటుంది.