Rains in India: ఇక్కడ ఆరెంజ్ అలర్ట్- అక్కడ రెడ్ అలర్ట్.. దేశంలో జోరుగా వర్షాలు
09 August 2022, 11:56 IST
- Rain in India today : దేశంలోని వివిధ ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు ముంబైవాసులు తడిసి ముద్దవుతున్నారు. ఇక కర్ణాటకలోనూ విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి.
ముంబైలో వర్షాలు
Rain in India today : దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ముంబై, థానే ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది భారత వాతావరణశాఖ.
ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ముంబై, నవీ ముంబై ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. ఉదయం 10 గంటల తర్వాత పరిస్థితులు కాస్త సానుకూలంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల కారణంగా.. ముంబై మెరైన్ డ్రైవ్‌లో అలలు పైకి ఎగిసిపడుతున్నాయి.
ముంబై వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలయమయ్యాయి. అంధేరీ ప్రాంతంలో మోకాళ్ల వరకు నీళ్లు పేరుకుపోవడంతో.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రెడ్ అలర్ట్..
Mumbai rains : మరోవైపు.. ఉత్తర కోంకణ్, ఉత్తర మధ్య మహారాష్ట్ర, తూర్పు- పశ్చిమ విదర్భ, ఒడిశా, గోవా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఆగస్టు 12 వరకు భారీ వర్షాలు పడతాయని, ఆ తర్వాతే కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉందని పేర్కొంది.
వర్షాల తీవ్రతను సూచించేందుకు.. సాధారణంగా నాలుగు అలర్ట్‌లు ఉంటాయి. గ్రీన్ అంటే ఎలాంటి హెచ్చరికలు ఉండవు. యెల్లో అలర్ట్ అంటే.. కాస్త గమనించాలి. ఆరెంజ్ అలర్ట్ అంటే.. అప్రమత్తంగా ఉండాలి. ఇక రెడ్ అలర్ట్ అంటే పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్టు.
కర్ణాటక వర్షాలు..
కర్ణాటకవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి. ఫలితంగా డ్యామ్‌లు నిండుకుండల్లాగా దర్శనమిస్తున్నాయి. కర్ణాటక వర్షాలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు!
Karnataka rains : రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో.. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని సమాచారం. ముఖ్యంగా తూర్పు జిల్లాల్లో.. అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.
దక్షిణ కన్నడ, ఊడిపి, ఉత్తర్ కన్నడ, బీదర్, కలబురగి, చిక్కమంగళూరు, కొడగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బగల్కోటే, బెళగావి, విజయపుర, యాద్గిర్, హసన్, శివమొగ్గ జిల్లాలకు యెల్లో అలర్ట్‌ను ఇచ్చింది.
ఢిల్లీలో మాత్రం..
మొత్తం దేశవ్యాప్తంగా వర్షాలు పడుతుంటే.. ఢిల్లీ గోల ఢిల్లీది! అక్కడ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. గురువారం వరకు ఎలాంటి వర్షాలు పడకపోవచ్చని వాతావరణశాఖ వెల్లడించింది. గురువారం తర్వాత కాస్త జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.