Rains in Telangana: మరో 3 రోజులు భారీ వర్షాలు… ఈ జిల్లాలకు హెచ్చరికలు
Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అకాశం ఉంది. ప్రస్తు తం రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను వెల్లడించింది.
Rain alert for telangana: రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఉపరితల ద్రోణికి అనుబంధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లోని ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో గత రెండ్రోజులుగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరో రెండు మూడు రోజులు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
ఇక నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అకడకక్కడ భారీ వర్షాలు కురిసే అకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. నైరుతి సీజన్ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు మరింత జోరందుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల రెండో వారంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి, అతిభారీ, అత్యంత భారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.