Rain alert : నేడు, రేపు అతి భారీ వర్షాలు….
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమవుతుండటంతో సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హైదరాబాద్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చడంతో దాని ప్రభావం ఒడిశా , ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణకు వరకు వ్యాపించి ఉంది. అల్పపీడనానికి తోడు గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం భూ ఉపరితలం నుంచి 7.6కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉండటంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి.
రుతుపవనా ద్రోణి ప్రభావం రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి అల్పపీడనం విస్తరించి ఉన్న ప్రాంతాల వరకు వ్యాపించాయి. అల్పపీడనంతో పాటు రుతుపవనాలు కూడా జత కలవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొద్ది గంటల్లోనే కుంభవృష్టి మాదిరి వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు ఆదివారం తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. 12 గంటల వ్యవధిలో 484 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నల్లగొండ జిల్లా ములకచర్లలో 10.6సెంటిమీటర్ల వర్షపాత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ ధరిలో 5.9సెం.మీ వర్షం కురిసింది. కుమురం భీం జిల్లా బెజ్జరులో 4.9 సెంటిమీటర్ల వర్షం నమోదైంది. జయశంకర్ జిల్లా పెద్దంపేటలో 4.8సెంటిమీటర్ల వర్షం నమోదైంది.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో తీవ్ర అల్పపీడనంగా మారింది. సోమ, మంగళవారాల నాటికి వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. పశ‌్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా, చత్తీస్‌గడ్ మీదుగా తీరం దాటుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి తోడు నైరుతి రుతుపవన ద్రోణి కూడా ఆగ్నేయ దిశగా అండమాన్ వరకు విస్తరించడంతో ఉత్తరకోస్తా, యానాంలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురువనున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఆదివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అల్లూరి జిల్లా గంగవరంలో 127.75మి.మీ, కోనసీమ జిల్లా మల్కిపురంలో 96.25మి.మీ వర్షపాతం నమోదైంది. విజయవాడ, విశాఖపట్నం, ఏలూరులో ఆదివారం భారీగా వర్షపాతం నమోదైంది.
టాపిక్