IMD alerts: గోవా వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారా? ఇంకోసారి ఆలోచించండి..
24 September 2024, 15:20 IST
Goa weather: ఈ వర్షాకాలంలో చాలా భారతీయ రాష్ట్రాలు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు చేశాయి. గుజరాత్, రాజస్థాన్ ల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభం అయిన నేపథ్యంలో.. గోవా, ముంబై, మహారాష్ట్ర, కోస్తా కర్నాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గోవా, మహారాష్ట్ర, కర్నాటకలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
Goa tour: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ గుజరాత్, రాజస్థాన్ లలో ప్రారంభమైంది. అయితే సెప్టెంబర్ 24 మంగళవారం ముంబై, పలు ఇతర మహారాష్ట్ర జిల్లాలు, కోస్తా కర్ణాటక, గోవా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది.
గోవాకు రెడ్ అలర్ట్
భారత వాతావరణ శాఖ మంగళవారం గోవా (Goa), గోవా సమీప జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గోవా సహా కోస్తా కర్ణాటక లోని పలు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు, మహారాష్ట్రంలోని మరాఠ్వాడా ప్రాంతం, మధ్య మహారాష్ట్రకు, అలాగే, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొంకణ్, గోవా, కోస్తా కర్ణాటక, మధ్యప్రదేశ్, విదర్భ, చత్తీస్ గఢ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
20 సెంమీలకు పైగా వర్షపాతం
కొంకణ్, గోవా, కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (> 20 సెంటీమీటర్లు) కురిసే అవకాశం ఉంది. మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో భారీ నుంచి అతిభారీ వర్షాలు (≥12 సెంటీమీటర్లు) కురిసే అవకాశం ఉందని ఐఎండీ తన వాతావరణ బులెటిన్ లో తెలిపింది. కేరళ, మాహే, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) తెలిపింది.
సబ్ హిమాలయ ప్రాంతాల్లో వేడి వాతావరణం
సబ్ హిమాలయన్ ప్రాంతాల్లో వేడి. తేమతో కూడిన వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. కేరళ, కర్ణాటక కొంకణ్, గోవా, మహారాష్ట్ర తీరాల్లో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ (imd) తన వాతావరణ బులెటిన్ లో పేర్కొంది. సెప్టెంబర్ 24, మంగళవారం ఉదయం 8:05 గంటలకు ఏక్యూఐ రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ డేటా ప్రకారం భాగల్పూర్, వడోదర, ఘజియాబాద్, నోయిడా మొదలైనవి అత్యంత కలుషితమైన నగరాల్లో ఉన్నాయి.