Bengaluru weather : అతి భారీ వర్షాలు పడాల్సిన నెలలో వానలే లేవు- బెంగళూరులో పెరిగిన ఉష్ణోగ్రతలు!
Bengaluru weather : బెంగళూరులో ఈ సెప్టెంబర్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది! సాధారణంగా అతి భారీ వర్షాలు కురవాల్సిన సెప్టెంబర్ నెలలో అసలు వానలు సరిగ్గా పడలేదు. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోయాయి. ఇందుకు గల కారణాలను నిపుణులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలు వరదలతో కొట్టుకుపోయాయి. కానీ కర్ణాటక రాజధాని బెంగళూరులో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నాయి! సాధారణంగా సెప్టెంబర్ నెలలో బెంగళూరులో అతి భారీ వర్షాలు పడుతుంటాయి. కానీ ఈసారి వానలే లేవు.
అతి భారీ వర్షాలు పడాల్సిన నెలలో..!
సెప్టెంబర్ 19 నాటికి, నగరంలో కేవలం 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది ఈ సమయంలో సగటు 105.8 మిల్లీమీటర్ల కంటే చాలా చాలా తక్కువగా ఉందని బెంగళూరులోని వాతావరణ కేంద్రం అధిపతి ఎన్. పువియరసన్ పేర్కొన్నట్లు డెక్కన్ హెరాల్డ్ పేర్కొంది.
చారిత్రకంగా ఈ నెలలో సగటు వర్షపాతం 208.3 మి.మీగా ఉంటుంది.
బలహీనమైన గాలులు, వాతావరణంలో తేమ తగ్గడం వల్ల మేఘాలు ఏర్పడడానికి ఆటంకం ఏర్పడిందని, అందుకే వర్షాలు పడటం లేదని ఐఎండీ పేర్కొంది. వానలు లేకపోవడంతో సెప్టెంబర్ నెలలో బెంగళూరులో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించింది.
ఇదీ చూడండి:- Kannada prescriptions : కన్నడలో మందుల చీటీ రాస్తున్న డాక్టర్లు- పొగుడుతున్న కర్ణాటక ప్రజలు!
దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తక్కువగా ఉన్నాయని, అయితే ఉత్తర జిల్లాల్లో మాత్రం ఈ వర్షాకాలంలో అధిక వర్షపాతం నమోదైందని పువియరసన్ తెలిపారు.
"ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 5 వరకు, సూర్యుడు నేరుగా రాష్ట్రంపై ప్రకాశించాడు! వాతావరణంలో తేమ లేకపోవడం వల్ల జీరో షాడో రోజులు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో ఇది ఎక్కువ కనిపించింది," అని పువియరసన్ అన్నారు.
జూన్ 1 నుంచి సెప్టెంబర్ 19 వరకు, కర్ణాటకలో మొత్తం 869.5 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ అంచనా 768.3 మి.మీ కంటే ఇది కొంచెం ఎక్కువ. జులై, ఆగస్టు ప్రారంభం మధ్య అత్యధిక వర్షపాతం నమోదైంది. అప్పటి నుంచి పలు ప్రాంతాల్లో వర్షపాతం తగ్గిందని నివేదిక పేర్కొంది.
కర్ణాటకలోని తీరప్రాంతాల్లో ఈ ఏడాది 3,609 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 2,994.9 మిల్లీమీటర్లతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే.
కాగా బెంగళూరు ప్రజలకు ఐఎండీ ఉపశమనాన్ని ఇచ్చే వార్త చెప్పింది. రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
గతేడాది బెంగళూరులో వర్షాలు సరిగ్గా పడలేదు. ఫలితంగా వేసవి వచ్చే ముందే, జనవరి నుంచి మహా నగరంలో నీటి కొరత సమస్యలు పెరిగిపోయాయి. పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. నీటి సమస్యలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
సంబంధిత కథనం