Bengaluru news: ధోతి కట్టుకున్నాడని రైతును మాల్ లోనికి అనుమతించలేదు; బెంగళూరులోని జీటీ మాల్ నిర్వాకం-70yearold farmer denied entry to bengaluru mall over attire report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru News: ధోతి కట్టుకున్నాడని రైతును మాల్ లోనికి అనుమతించలేదు; బెంగళూరులోని జీటీ మాల్ నిర్వాకం

Bengaluru news: ధోతి కట్టుకున్నాడని రైతును మాల్ లోనికి అనుమతించలేదు; బెంగళూరులోని జీటీ మాల్ నిర్వాకం

HT Telugu Desk HT Telugu
Jul 17, 2024 03:51 PM IST

Bengaluru news: సంప్రదాయ దుస్తులైన ధోతి, తెల్ల చొక్కా ధరించి వచ్చిన ఒక 70 ఏళ్ల రైతును బెంగళూరులోని ఒక ప్రముఖ మాల్ లోపలికి అనుమతించలేదు. దీనిపై తన తండ్రికి ఆ మాల్ లోని మల్టిప్లెక్స్ లో సినిమా చూపించాలనుకున్న ఆ రైతు కుమారుడు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశాడు.

ధోతి కట్టుకున్నాడని బెంగళూరులోని జీటీ మాల్ లోనికి అనుమతించలేదు
ధోతి కట్టుకున్నాడని బెంగళూరులోని జీటీ మాల్ లోనికి అనుమతించలేదు

Bengaluru news: బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న నాగరాజ్ ఊరి నుంచి వచ్చిన తన తండ్రికి జీటీ వరల్డ్ మాల్ లోని మల్టీ ప్లెక్స్ లో సినిమా చూపించాలనుకున్నాడు. నాగరాజ్ 70 ఏళ్ల తన తండ్రి ఫకీరప్ప తో కలిసి బెంగళూరులో, మాగడి మెయిన్ రోడ్డులోని జీటీ మాల్ కు వెళ్లాడు. కానీ, మాల్ సెక్యూరిటీ ఫకీరప్పను మాల్ లోనికి అనుమతించలేదు. అందుకు కారణం, ఫకీరప్ప భారతీయ సంప్రదాయ వస్త్రాలైన ధోతి, చొక్కా ధరించి ఉండడమే. ధోతి తీసేసి, ప్యాంట్ వేసుకుని వస్తే, మాల్ లోనికి అనుమతిస్తామని ఆ మాల్ సెక్యూరిటీ చీఫ్ చెప్పాడు. దాంతో, తన తండ్రికి సినిమా చూపించకుండానే, నాగరాజ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మాల్ యాజమాన్యంపై విమర్శలు

ఈ మొత్తం ఘటనను నాగరాజ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స్థానిక మీడియాకు కూడా దీనిపై సమాచారం ఇచ్చాడు. ధోతీలు ధరించిన వ్యక్తుల ప్రవేశాన్ని మాల్ డ్రెస్ కోడ్ నిషేధిస్తోందని సెక్యూరిటీ సూపర్ వైజర్ నాగరాజ్ తో చెప్పడం, ధోతికి బదులుగా ప్యాంటు ధరిస్తే ఫకీరప్పను లోపలికి అనుమతిస్తామని చెప్పడం ఆ వీడియోలో రికార్డయింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మాల్ యాజమాన్యం అధికారికంగా క్షమాపణలు చెప్పకపోతే ఆ మాల్ ముందు ఆందోళన చేస్తామని స్థానిక రైతు సంఘాలు హెచ్చరించాయి. బెంగళూరు (bengaluru) లో మల్టీప్లెక్స్ సెట్టింగ్ లో తన తండ్రితో కలిసి సినిమా అనుభవాన్ని పంచుకోవాలనే కోరిక తీరకపోవడంతో ఆవేదననతో అక్కడి నుంచి వెళ్లిపోయానని నాగరాజ్ మీడియాకు ఇచ్చిన ప్రకటనలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

నా సంప్రదాయాన్ని ఎందుకు వదులుకుంటాను?

ఫకీరప్ప కూడా ఈ విషయంపై స్పందించారు. ‘‘గ్రామాల్లోని ప్రజలు ధోతీని వదిలేసి ప్యాంటు వేసుకుని సినిమా చూడటానికి వస్తారా?’’ అని ప్రశ్నించారు. మాల్ లోపలికి వెళ్లడం కోసం తన సంప్రదాయ దుస్తులను వదులుకోలేనని తేల్చి చెప్పారు. ‘‘నా ఐదుగురు పిల్లల్ని చదివించాను. వారు ఇప్పుడు బాగానే ఉన్నారు. కానీ నేను నా సంస్కృతిని, సంప్రదాయ వస్త్రధారణను వదిలేసి కేవలం మాల్ కు వెళ్లడానికి ప్యాంట్లు ధరించడం మొదలుపెట్టలేను. సొంత రాష్ట్రంలో మన వస్త్రధారణ, సంప్రదాయం గురించి చిన్నచూపు చూడటం బాధాకరంగా ఉంది అన్నారు.

గతంలో కూడా..

గతంలో కూడా ఇలాంటి ఘటన బెంగళూరు మెట్రోలో జరిగింది. అప్పుడు కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. మురికి బట్టలు వేసుకున్నాడనే కారణంతో బెంగళూరు మెట్రో భద్రతా సిబ్బంది ఒక వృద్ధుడికి మెట్రో ప్రవేశం నిరాకరిస్తున్న వీడియో నాడు వైరల్ గా మారింది. తలపై బట్టల మూట పెట్టుకుని, మురికిగా ఉన్న తెల్ల చొక్కా ధరించిన ఒక వృద్ధుడిని రాజాజీనగర్ మెట్రో స్టేషన్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఆపడంపై సోషల్ మీడియాలో దుమారం రేగింది.