తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gujarat Viral Video: రూ.200 కోట్లు వదులుకుని సన్యాసం; జనంపై నగదు వర్షం కురిపించిన వ్యాపారవేత్త దంపతులు

Gujarat viral video: రూ.200 కోట్లు వదులుకుని సన్యాసం; జనంపై నగదు వర్షం కురిపించిన వ్యాపారవేత్త దంపతులు

HT Telugu Desk HT Telugu

17 April 2024, 8:57 IST

google News
  • Gujarat viral video: గుజరాత్ కు చెందిన ఒక సంపన్న వ్యాపారవేత్త దంపతులు తమ రూ. 200 కోట్ల సంపదను తృణపాయంగా వదిలేసి సన్యాసం స్వీకరించారు. గుజరాత్ లోని తమ స్వస్థలం సబర్ కాంతలో ఆదివారం భారీ ఊరేగింపు నిర్వహించి, డబ్బును, విలువైన ఆభరణాలను, దుస్తులను ప్రజల పైకి విసిరివేశారు.

ఊరేగింపులో పాల్గొన్న భవేశ్ భండారీ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు
ఊరేగింపులో పాల్గొన్న భవేశ్ భండారీ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు

ఊరేగింపులో పాల్గొన్న భవేశ్ భండారీ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు

Gujarat viral video: గుజరాత్ వ్యాపారవేత్త భవేష్ భండారీ (Bhavesh Bhandari), ఆయన భార్య ఇటీవల సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. పూర్తిగా నిరాడంబర జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని తమ జీవితకాల సంపాదన అయిన రూ.200 కోట్లను ప్రజలకు విరాళంగా ఇచ్చేశారు. ఆదివారం భారీ ఊరేగింపు నిర్వహించి. పెద్ద ఎత్తున నగదు, ఇతర ఆభరణాలను ప్రజలకు అందజేశారు. త్వరలోనే వారు పూర్తిస్థాయిలో సన్యాసం తీసుకోనున్నారు.

ప్రజలపై నగదు వర్షం

సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత, భవేష్ భండారీ దంపతులు తమ సంపదను, నగదును, ఖరీదైన ఆభరణాలను, ఖరీదైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను ప్రజలకే ఇచ్చివేయాలనుకున్నారు. ఖరీదైన ఉపకరణాలను వాడకూడదని నిర్ణయించుకున్నారు. దాంతో, ఆదివారం గుజరాత్ లోని సబర్ కాంత జిల్లాలో రథాన్ని తలపించేలా అలంకరించిన వాహనంలో నిల్చొని, కుటుంబ సభ్యులతో కలిసి భారీ ఊరేగింపులో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన భవేష్ భండారీ, ఆయన భార్య వాహనంపై నిల్చొని, భారీగా తరలివచ్చిన ప్రజలపైకి డబ్బులను, ఆభరణాలను, ఇతర విలువైన వస్తువులను విసిరివేశారు. ఆ ఊరేగింపుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఆ ఊరేగింపు వీడియోలో వ్యాపారవేత్త, ఆయన భార్య బట్టలు విసరడం, నగదు వర్షం కురిపించడం కనిపించింది. నోట్లు తీసుకునేందుకు జనం ఎగబడుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.

ఏవరీ భవేష్ భండారీ?

భవేష్ భండారీ నిర్మాణ రంగ వ్యాపారవేత్త. సబర్ కాంత, అహ్మదాబాద్ ల్లో అనేక కన్ స్ట్రక్షన్ ప్రాజెక్టులను నిర్మించారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారిద్దరూ 2022 లోనే సన్యాస దీక్ష తీసుకోవడం విశేషం. సన్యాస దీక్ష అనేది ఒక వ్యక్తి సన్యాసి లేదా ఆధ్యాత్మిక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి అధికారికంగా కట్టుబడి ఉండే వేడుక. ఇప్పుడు భవేశ భండారీ దంపతులు కూడా సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో, ఆ కుటుంబం మొత్తం సన్యాస జీవితం గడపనున్నారు. వారు ఎయిర్ కండిషనర్లు, ఫ్యాన్లు, బెడ్లు, ఏ రకమైన ఎలక్ట్రానిక్స్, ఇతర గాడ్జెట్స్ ను వాడబోరు.

గుజరాత్ లో ఇతరులు కూడా..

గతేడాది గుజరాత్ (GUJARAT) లోని ఓ సంపన్న వజ్రాల వ్యాపారి ధనేష్, అమీ సంఘ్వీ దంపతుల కుమార్తె అయిన తొమ్మిదేళ్ల దేవాన్షి సూరత్ లో సంప్రదాయ జైన ఆచారం అనంతరం సన్యాసినిగా మారింది. అదేవిధంగా 2018లో సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి 12 ఏళ్ల కుమారుడు భవ్య షా జైన సన్యాసిగా మారాడు. జైన సన్యాసిగా మారడానికి కొన్ని రోజుల ముందు, భవ్య షా తన కుటుంబ స్నేహితుడికి చెందిన తనకు ఇష్టమైన ఫెరారీ కారులో ప్రయాణించారని అతని తండ్రి దీపేష్ షా తెలిపారు.

తదుపరి వ్యాసం