GSB seva mandal insurance : గణేశ్ ఉత్సవాల కోసం రూ. 316 కోట్ల బీమా!
30 August 2022, 11:19 IST
- GSB seva mandal insurance : వినాయక చవితి కోసం వివిధ ప్రాంతాల్లో మండపాలు ముస్తాబవుతున్నాయి. అయితే.. ముంబైకి చెందిన జీఎస్బీ సేవా మండల్.. రూ. 316కోట్లు విలువ చేసే బీమాను తీసుకుంది. ఎందుకంటే..
వినాయకుడి ఉత్సవాల కోసం భారీ మొత్తంలో బీమా తీసుకున్న జీఎస్బీ సేవా మండల్
GSB seva mandal insurance : వినాయక చవితి అంటే.. దేశవ్యాప్తంగా హడావుడి ఉంటుంది. ఇక మహారాష్ట్రలో ఈ హడావుడి ఇంకాస్త ఎక్కువే! 10 రోజల పాటు భారీ మండపాలు, అతి భారీ విగ్రహాలతో.. ముంబై వీధులు కళకళలాడిపోతూ ఉంటాయి. ఈసారి కూడా అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. వీటి మధ్య.. ముంబైలోని జీఎస్బీ సేవా మండల్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ జీఎస్బీ సేవా మండల్.. గణేశ్ ఉత్సవాల కోసం ఏకంగా రూ. 316.40కోట్లు విలువ చేసే బీమాను తీసుకుంది!
ముంబై కింగ్ సర్కిల్లోని అత్యంత సంపన్నమైన వినాయకుడి మండపాల్లో ఈ జీఎస్బీ సేవా మండల్ ఒకటి. ఉత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తులు.. ఇక్కడి గణేశుడిని దర్శించుకుంటారు. అందుకు తగ్గట్టుగానే జీఎస్బీ సేవా మండల్ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తారు. ఈ క్రమంలోనే కార్యకలాపాలకు సంబంధించి బీమాలు కూడా తీసుకుంటారు. ఈసారి అత్యధికంగా.. రూ. 316.40కోట్ల బీమాను తీసుకున్నారు. జీఎస్బీ సేవా మండల్ చరిత్రలో ఇదే అత్యధిక బీమా మొత్తం అని సభ్యులు వివరించారు.
Ganpati mandal in Mumbai : ఈ ఇన్షూరెన్స్ కవరేజీలో.. రూ. 31.97కోట్లు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులకు వెళతాయి. రూ. 263 కోట్లు.. మండపం, వాలెంటీర్లు, పూజారులు, వంట చేసే వారు, ఫుట్స్టాల్ వర్కర్లు, వాలెట్ పార్కింగ్ సభ్యులు, సెక్యూరిటీ గార్డులకు కేటాయించారు.
అగ్నిప్రమాదాలు సంభవిస్తే జరిగే నష్టానికి రూ. 1కోటి బీమా తీసుకుంది జీఎస్బీ సేవా మండల్. పైగా.. కంప్యూటర్లు, సీసీటీవీ కెమెరాలు, స్కానర్ల కోసం బీమాను కూడా తీసుకుంది.
వినాయకుడి కోసం నిరీక్షిణ..
Ganesh Chaturthi 2022 : గణేశ్ చతుర్థికి ఇంకా ఒక రోజు సమయం మాత్రమే ఉంది. లంబోదరుడి రాక కోసం దేశ ప్రజలు నిరీక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వినాయక చవితి హడావుడి నెలకొంది. 10 రోజుల పాటు భక్తుల పూజలతో విఘ్నేశ్వరుడు తరించనున్నాడు. అందుకోసం గణేశుని విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక ఫొటో గ్యాలరీని వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
వినాయక చవితి సందర్భంగా గణేశుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి 10 రోజుల పాటు భక్తులు పూజలు చేస్తారు. 11వ రోజు వినాయకుని నిమజ్జనానికి సిద్ధమవుతారు. అందమైన ఊరేగింపు తర్వాత గణేశుడి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. అయితే పదకొండు రోజులు పూజలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. వినాయకుని పూజ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.