Indian students in US: అమెరికాలోని భారతీయ విద్యార్థులకు శుభవార్త; ఇమిగ్రెంట్ వీసాకు ఇక నేరుగా అప్లై చేసుకోవచ్చు..
21 December 2023, 18:39 IST
Good news for Indian students in US: అమెరికాలో చదువుతున్న భారత్ సహా ఇతర దేశాల విద్యార్థులకు అమెరికా శుభవార్త తెలిపింది. ఎఫ్ 1 వీసాతో యూఎస్ లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఇమిగ్రెంట్ వీసాకు అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రతీకాత్మక చిత్రం
Good news for Indian students in US: తమ దేశంలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు ప్రయోజనం కలిగే విధంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్1 వీసాతో యూఎస్ లో చదువుతున్న విదేశీ విద్యార్థులు ఉపాధి-ఆధారిత (Employment-Based EB) కేటగిరీలో ఇకపై ఇమిగ్రెంట్ వీసా (immigrant visa) కు నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఇమిగ్రెంట్ వీసా పొందిన విద్యార్థులు యూఎస్ లోని స్టార్ట్ అప్ లలో ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఈ మేరకు వీసా పాలసీ గైడ్ లైన్స్ లో యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కీలక మార్పులు చేసింది.
భారతీయ విద్యార్థులకు ప్రయోజనకరం
యూఎస్సీఐఎస్ (USCIS) తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం కానుంది. "(F1 వీసా) విద్యార్థులు శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ అప్లికేషన్ లేదా ఇమ్మిగ్రెంట్ వీసా పిటిషన్‌కు అప్లై చేసుకోవడానికి అర్హులు"అని యూఎస్సీఐఎస్ (USCIS) ప్రకటించింది. ఎఫ్, ఎం కేటగిరీల స్టుడెంట్ వీసాలకు సంబంధించి పలు నూతన నియమ నిబంధనలను అమెరికా ప్రకటించింది.
స్టార్ట్ అప్ ల కోసం పని చేయవచ్చు..
ఎఫ్ 1 వీసాతో యూఎస్ లో చదువుతున్న విద్యార్థులు, ముఖ్యంగా స్టెమ్ (STEM) కేటగిరీల విద్యార్థులు ఇమిగ్రెంట్ వీసా పొంది, యూఎస్ లోని స్టార్ట్ అప్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా, వారు తమ 36 నెలల ఓపీటీ (Optional Practical Training OPT) పీరియడ్ లో, నియమ నిబంధనలకు లోబడి, ఏదైనా స్టార్ట్ అప్ కంపెనీ లలో ఉద్యోగాలు చేసుకోవచ్చు.
ఎఫ్ 1 వీసా, ఎం 1 వీసా అంటే..
యునైటెడ్ స్టేట్స్‌లో గుర్తింపు పొందిన కళాశాల, విశ్వవిద్యాలయం, సెమినరీ, కన్సర్వేటరీ, అకడమిక్ హైస్కూల్, ఎలిమెంటరీ స్కూల్ లేదా భాషా శిక్షణా కార్యక్రమంతో సహా ఇతర విద్యాసంస్థలలో ఉన్నత విద్యకు వచ్చే విద్యార్థులకు ఎఫ్ 1 (F-1 visa) వీసా ఇస్తారు. వృత్తిపరమైన లేదా నాన్-అకడమిక్ స్టడీస్ (భాషా శిక్షణా కార్యక్రమాలను మినహాయించి) అభ్యసించే విద్యార్థులకు ఎం-1 వీసా (M-1) ఇస్తారు. F-1 వీసా పొందిన విద్యార్థుల కన్నా M-1 వీసా పొందిన విద్యార్థులకు కఠిన నిబంధనలు ఉంటాయి.