తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jodhpur Rape Case : ఇంట్లో నుంచి వచ్చేసిన మైనర్​పై​.. బాయ్​ఫ్రెండ్​ కళ్లెదుటే అత్యాచారం!

Jodhpur rape case : ఇంట్లో నుంచి వచ్చేసిన మైనర్​పై​.. బాయ్​ఫ్రెండ్​ కళ్లెదుటే అత్యాచారం!

Sharath Chitturi HT Telugu

17 July 2023, 7:24 IST

google News
  • Jodhpur rape case : రాజస్థాన్​లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి వచ్చేసిన మైనర్​పై, ఆమె బాయ్​ఫ్రెండ్​ కళ్లెదుటే కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇంట్లో నుంచి వచ్చేసిన మైనర్​- బాయ్​ఫ్రెండ్​ కళ్లెదుటే అత్యాచారం!
ఇంట్లో నుంచి వచ్చేసిన మైనర్​- బాయ్​ఫ్రెండ్​ కళ్లెదుటే అత్యాచారం!

ఇంట్లో నుంచి వచ్చేసిన మైనర్​- బాయ్​ఫ్రెండ్​ కళ్లెదుటే అత్యాచారం!

Jodhpur rape case : దళిత యువతి హత్య కేసుపై నిరసనలు ఆగకముందే.. రాజస్థాన్​లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాయ్​ఫ్రెండ్​తో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చేసిన ఓ దళిత మైనర్​పై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు! బాయ్​ఫ్రెండ్​ను కొట్టి, అతని కళ్లెదుటే ఈ దారుణానికి ఒడిగట్టారు.

ఇదీ జరిగింది..

రాజస్థాన్​ జోధ్​పూర్​లో గత శనివారం జరిగింది ఈ ఘటన. అజ్మీర్​లో నివాసముండే బాధితురాలి వయస్సు 17ఏళ్లు. ఆమె, తన బాయ్​ఫ్రెండ్​తో కలిసి జీవించేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. వారిద్దరు కలిసి బస్సులో రాత్రి 10:30 గంటలకు జోధ్​పూర్​ వెళ్లారు. అక్కడ ఓ గెస్​ హౌజ్​కు వెళ్లి రూమ్​ అడిగారు. కేర్​ టేకర్​ సురేశ్​ జాట్​.. మైనర్​పై అభ్యంతరకర రీతిలో ప్రవర్తించాడు. ఫలితంగా మైనర్​, ఆమె బాయ్​ఫ్రెండ్​ అక్కడి నుంచి బయటకి వెళ్లిపోయారు.

రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న వారిద్దరిని.. సమందర్​ సింగ్​ భాటి, ధర్మ్​పాల్​ సింగ్​, భట్టమ్​ సింగ్​లు చూశారు. వీరి వయస్సు 20-22ఏళ్ల మధ్యలో ఉంటుంది. వారిని ఆపి, ఏం జరిగిందో తెలుసుకున్నారు. తాము సాయం చేస్తామని నమ్మించారు. మైనర్​, ఆమె బాయ్​ఫ్రెండ్​కు భోజనం పెట్టి, కూల్​డ్రింక్​ ఇచ్చారు. ఆ తర్వాత ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో.. వారిద్దరిని జై నారాయణ్​ వ్యాస్​ యూనివర్సిటీ(జేఎన్​వీయూ) ఓల్డ్​ క్యాంపస్​లోని హాకీ గ్రౌండ్​కు తీసుకెళ్లారు. అక్కడే.. వారి నిజస్వరూపాన్ని బయటపెట్టారు.

Dalit girl raped in Jodhpur : బాయ్​ఫ్రెండ్​ను కొట్టిన ఆ ముగ్గురు.. అతడిని కట్టేశారు. అతని కళ్లెదుటే దళిత మైనర్​పై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఒకరి తర్వాత ఒకరు రేప్​ చేశారు.

కొంతసేపటికి ప్రజల మార్నింగ్​ వాక్​ మొదలైంది. అది చూసిన నిందితులు.. అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న బాయ్​ఫ్రెంట్​తో పాటు బాధితురాలిని కొందరు చూశారు. తమకు జరిగినది చెప్పిన బాయ్​ఫ్రెండ్​.. సాయం కోరాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్ట్​ చేశారు.

డాగ్​ స్క్వాడ్​ సాయంతో..

దళిత మైనర్​పై గ్యాంగ్​ రేప్ ఘటనను పోలీసులు అత్యంత తీవ్రంగా పరిగణించారు. వెంటనే రంగంలోకి దిగారు. డాగ్​ స్క్వాడ్​, ఫోరెన్సీక్​ సైన్స్​ లాబొరేటరీ బృందాల సాయంతో ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించారు. నిందితులు జోధ్​పూర్​లోని గణేశ్​పురా ప్రాంతంలో నివాసముంటారని తెలుసుకున్నారు. వారిని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లారు.

Rajasthan crime news : పోలీసులను చూసిన నిందితులు.. పారిపోయేందుకు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కాలు ఫ్యాక్చర్​ అయ్యింది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని పట్టుకున్న పోలీసులు.. ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం నిందితులను అరెస్ట్​ చేశారు.

కాగా.. సమందర్​ సింగ్​ అనే వ్యక్తి జేఎన్​వీయూ మొదటి సంవత్సరం విద్యార్థి అని తేలింది. ధర్మ్​పాల్​ సింగ్​.. జేఎన్​వీయూలో పీజీ విద్యార్థి అని సమాచారం. భట్టమ్​ సింగ్​ అజ్మీర్​వాసి. వీరితో పాటు గెస్ట్​ హౌజ్​ కేర్​టేకర్​ని కూడా అరెస్ట్​ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

రాజకీయ దుమారం..

తాజా ఘటనపై రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులుకు ఆదేశాలిచ్చారు. నిందితులకు ఆర్​ఎస్​ఎస్​ విద్యార్థి విభాగమైన ఏబీవీపీతో సంబంధం ఉన్నట్టు తేలిందని అన్నారు.

Jodhpur crime news : "బీజేపీ, దాని అనుసంధాన సంస్థల్లోని వారు రేప్​నకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్​, జోధ్​పూర్​లో ఇలాంటివి జరుగుతున్నాయి. వీటి ద్వారా బీజేపీ నిజస్వరూపం బయటపడింది. ఈ ఘటనపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎందుకు మౌనంగా ఉన్నారు? మా పోలీసులు అద్భుతమైన కృషిచేసి నిందితులను వెంటనే పట్టుకున్నారు. వారికి ఎంత పలుకుబడి ఉన్నా.. వారిని కఠినంగా శిక్షించేంత వరకు మేము ఆగము," అని గెహ్లోత్​ అన్నారు.

మరోవైపు.. గహ్లోత్​ ఆరోపణలను ఏబీవీపీ ఖండించింది. నిందితులతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేసింది.

తదుపరి వ్యాసం