Priyanka Gandhi : ఎన్నడూ లేని విధంగా వయనాడ్‌లో తక్కువ శాతం పోలింగ్.. ప్రియాంక గాంధీ గెలుస్తారా?
14 November 2024, 12:43 IST
Wayanad Election 2024 : వయనాడ్‌లో ఎప్పుడూ లేనివిధంగా చాలా తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. దీంతో కాంగ్రెస్ ఆశలు నెరవేరుతాయా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ గెలుస్తారా అనే దానిపై అందరి దృష్టి ఉంది.
ప్రియాంక గాంధీ
వయనాడ్ లోక్‌సభ స్థానంలో బుధవారం 64.72 శాతం పోలింగ్ నమోదైంది. 2009లో ఈ స్థానం ఏర్పడిన తర్వాత ఇదే అత్యల్ప పోలింగ్ శాతం కావడం గమనార్హం. రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ సీపీఐ అభ్యర్థి సత్యన్ మోకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌లతో ప్రియాంక గాంధీ పోటీ పడ్డారు. ఓటింగ్ శాతం తగ్గడంపై కాంగ్రెస్‌లోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక గాంధీకి 5 లక్షల ఓట్ల మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ ప్రచార సమయంలో ప్రకటించింది.
తక్కువ పోలింగ్ శాతం నమోదైందని, కానీ తాము ప్రకటించిన మార్జిన్ ఓటింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపదని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ తెలిపింది. పిటిఐ నివేదిక ప్రకారం.. ప్రియాంక గాంధీ గెలవదనే విషయాన్ని యూడీఎఫ్ నాయకులు ఖండించారు. కాంగ్రెస్ పార్టీ స్థానం బలంగా ఉందని పేర్కొన్నారు.
సీపీఐ(ఎం) ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఓటర్లలో ఉత్సాహం లేకపోవడమే ఓటింగ్ శాతం తగ్గడానికి కారణమని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వి.డి.సతీశన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల వచ్చిన శాతం తక్కువగా ఉందని, దీంతో పోలింగ్ శాతం తగ్గిందని చెప్పారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, దీపా దాస్ముని.. ప్రియాంక గాంధీ కోసం మద్దతు కూడగట్టారు. అంతేకాకుండా ప్రియాంక గాంధీ ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆ ప్రాంతంలో ఉండేలా కాంగ్రెస్ నేతలు చూసుకున్నారు.
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ప్రియాంక గాంధీ వాద్రా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఉపఎన్నికల సమయంలో ఈ నేతలు ప్రియాంక గాంధీ ప్రచారానికి నాయకత్వం వహించి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దించేందుకు చురుగ్గా ప్రయత్నించారు.
వయనాడ్ జిల్లాలో భారీ వరదలు సంభవించిన కొన్ని నెలల తర్వాత ఈ ఉప ఎన్నిక వచ్చింది. వరదల కారణంగా 231 మంది చనిపోయారు. 47 మంది గల్లంతయ్యారు. వయనాడ్ ఉపఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ ప్రియాంక గాంధీ విజయానికి ఎలాంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్, యూడీఎఫ్ నేతలు భావిస్తున్నారు. పోలింగ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఆశలు నెరవేరుతాయా? వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఐదు లక్షల మెజారిటీతో గెలుస్తారా? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.